పొల్యూషన్‌... దొరికింది సొల్యూషన్‌

29 Mar, 2020 02:17 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన పది నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన మన దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పుణ్యమా అని వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. శనివారం నాటికి సుమారు 40 కరోనా కేసులు నమోదవడం, ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్, పలువురు స్వీయ నిర్బంధంలో ఉండటం ఇందుకు కారణం. భారత వాతావరణ విభాగం అంచనాలను బట్టి ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలకే పరిమితమయ్యాయి. వాహనాలు తక్కువగా తిరుగుతుండటం, ఫ్యాక్టరీలను తాత్కాలికంగా బంద్‌ చేయడంతో వాయు కాలుష్యం కూడా బాగా తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో ఢిల్లీలో వాయు నాణ్యతను సూచించే ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ వెయ్యి వరకు ఉండేది. కానీ కరోనా కట్టడి మొదలైన తరువాత ఇది ఏకంగా 129కి పడిపోవడం గమనార్హం.

కరోనా వైరస్‌ పుట్టినిల్లుగా భావించే వూహాన్‌లోనూ ఇదే పరిస్థితి. జనవరి 23 నుంచి వూహాన్‌తోపాటు హుబే ప్రావిన్స్‌ ప్రాంతం మొత్తమ్మీద లాక్‌డౌన్‌ విధించగా ఒకట్రెండు రోజుల క్రితమే దశలవారీగా ఎత్తివేసే ప్రక్రియ మొదలైంది. ఈ కాలం నాటి ఉపగ్రహ ఛాయాచిత్రాలను చూస్తే వూహాన్‌ (పక్క చిత్రం) ప్రాంతంలో గ్రీన్‌హౌస్‌ వాయువైన నైట్రస్‌ ఆక్సైడ్‌ గణనీయంగా తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కచ్చితంగా చెప్పాలంటే నైట్రోజన్‌ ఆధారిత కాలుష్యం 40 శాతం వరకు తగ్గిందని, చైనా మొత్తమ్మీద పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ కాలుష్యం 20 – 30 శాతం వరకు తగ్గిందని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ చెబుతోంది. 

మరిన్ని వార్తలు