ఆ రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు స్థానం లేదు

20 May, 2016 15:48 IST|Sakshi
ఏఐఏడీఎంకే విజయోత్సాహం

హైదరాబాద్: ప్రాంతీయ పార్టీలు బలం ఉన్నచోట జాతీయ పార్టీలు తమ బలాన్ని ప్రదర్శించలేకపోతున్నాయి. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కూడా ఇది రుజువైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు ఏమాత్రం పురోగతి సాధించలేకపోయాయని స్పష్టమవుతోంది.

ప్రస్తుతం ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో తమ బలం పెంచుకోవాలన్న బీజేపీ, కాంగ్రెస్ ల ప్రయత్నాలు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ముందు నిలువలేదు. తమిళనాడులో ఏఐఏడీఎంకే, డీఎంకేల మధ్య, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. 2014 లో లోక్ సభ సాధారణ ఎన్నికలు ఆ తర్వాత క్రమంలో 9 రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఒరవడిని పరిశీలిస్తే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీల ప్రభావం బాగా కనిపించింది.

తాజా ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో ప్రవేశించడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. 2011 లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 0 శాతం ఓట్లు సాధించగా ఎంతో ప్రయత్నించినప్పటికీ ఈసారి కూడా 3 శాతం ఓట్లు దాటలేదు. అలాగే కేరళలో ఎన్నో కొత్త ప్రయోగాలు చేసినప్పటికీ 1 శాతం ఓట్లకు మించి సాధించలేకపోయింది. తమిళనాడులోనూ అదే పరిస్థితి. ఏఐఏడీఎంకే, డీఎంకేలతో పాటు మరిన్ని ప్రాంతీయ పార్టీల మధ్య జరిగిన ఎన్నికల పోరాటంలో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.

30 ఏళ్లపాటు ఏకచత్రాధిపత్యం కొనసాగిస్తూ వచ్చిన సీపీఎంను పశ్చిమ బెంగాల్ లో ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన తృణమూల్ కాంగ్రెస్ పెద్ద దెబ్బ తీసింది. మూడు దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగిన సీపీఎం ఈసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించలేకపోయింది.

బీజేపీ అస్సాంలో చరిత్ర తిరగరాసింది. అయితే అక్కడ ప్రాంతీయ పార్టీల ప్రభావం లేదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి ఈసారి ఎన్నికల్లో అధికార పగ్గాలు సాధించగలిగింది. 2011 (5 స్థానాలు గెలుచుకుంది) లో 11.47 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 29.5 శాతం ఓట్లను (60 స్థానాలను కైవసం చేసుకుంది) సాధించి అధికారాన్ని దక్కించుకుంది.

2014 లోక్ సభ సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతిన్నది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కొంత సానుకూల ఫలితం రాబట్టుకున్నప్పటికీ అక్కడి ప్రాంతీయ పార్టీలతో అది కూడా మూడో చిన్న పార్టీగా మాత్రమే పొత్తు పెట్టుకుని పరిమితమైన సంఖ్యలో సీట్లను గెలుచుకోగలిగింది. 2014 సాధారణ ఎన్నికలు ఆ తర్వాత జరిగిన ఆయా రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో కాంగ్రెస్ ప్రస్తుతం ఆరు రాష్ట్రాలకే పరిమితమైంది. తాజాగా అస్సాంను కలిపితే బీజేపీ తొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతోంది. అంటే దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, మిత్రపక్షాల కూటములే అధికారంలో ఉన్నాయి. తెలంగాణ, ఏపీ, జమ్ము కాశ్మీర్, ఒడిస్సా, బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఆయా జాతీయ పార్టీల పొత్తులతో కూడిన కూటములు అధికారంలో కొనసాగుతున్నాయి.
 

మరిన్ని వార్తలు