కలవరపెట్టిన పాక్‌ సబ్‌మెరైన్‌

24 Jun, 2019 04:58 IST|Sakshi

బాలాకోట్‌ తర్వాత మాయమైన ‘పీఎన్‌ఎస్‌ సాద్‌’

21 రోజులపాటు సముద్రాన్ని గాలించిన భారత నేవీ

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే మొహమ్మద్‌ ఉగ్రస్థావరంపై భారత్‌ ఫిబ్రవరి 26న వైమానికదాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక సబ్‌మెరైన్‌ ఒకటి భారత అధికారులను తీవ్రంగా కలవరపెట్టింది. చాలాకాలం నుంచి భారత్‌ పాక్‌ నేవీ కదలికలపై నిఘా ఉంచుతోంది. ఈ క్రమంలో బాలాకోట్‌ దాడుల తర్వాత పాక్‌ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా 60కిపైగా యుద్ధనౌకలు, విమానవాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యను అంతర్జాతీయ సముద్ర జలాల్లో మోహరించింది.

ఈ నేపథ్యంలో పాక్‌ నేవీకి చెందిన అగొస్టా క్లాస్‌ సబ్‌మెరైన్‌ ‘పీఎన్‌ఎస్‌ సాద్‌’ కరాచీకి సమీపంలో అదృశ్యమైపోయింది. ‘ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రపల్షన్‌’ సాంకేతికత ఉన్న ఈ పీఎన్‌ఎస్‌ సాద్‌ మిగతా సబ్‌మెరైన్ల కంటే ఎక్కువరోజులు సముద్రగర్భంలో ఉండిపోగలదు. దీంతో భారత్‌పై దాడికి పాక్‌ పీఎన్‌ఎస్‌ సాద్‌ ను పంపిందన్న అనుమానం భారత అధికారుల్లో బలపడింది. పీఎన్‌ఎస్‌ సాద్‌ గుజరాత్‌ తీరానికి 3 రోజుల్లో, ముంబైకి 4 రోజుల్లో చేరుకోగలదని నేవీ నిపుణులు అంచనా వేశారు. దాన్ని అడ్డుకునేందుకు అణు సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ చక్ర, ఐఎన్‌ఎస్‌ కల్వరితో పాటు పీ–8ఐ విమానాలను రంగంలోకి దించారు.

వీటితోపాటు ఉపగ్రహాల సాయంతో 21 రోజుల పాటు గాలించారు.  భారత జలాల్లో ప్రవేశించి లొంగిపోకుంటే సాద్‌ను పేల్చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చివరికి 21 రోజుల తర్వాత పాక్‌కు పశ్చిమాన ఉన్న సముద్రజలాల్లో పీఎన్‌ఎస్‌ సాద్‌ను భారత నేవీ గుర్తించింది. ఈ విషయమై నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్‌ డీకే శర్మ మాట్లాడుతూ.. భారత్‌తో యుద్ధం తలెత్తితే రహస్యంగా దాడి చేసేందుకు పాక్‌ సాద్‌ను వ్యూహాత్మకంగా అక్కడ మోహరించిందని తెలిపారు. కానీ భారత దూకుడు, అంతర్జాతీయ ఒత్తిడిలతో పాక్‌ తోకముడిచిందని వెల్లడించారు. దీంతో మక్రాన్‌ తీరంలోనే ïసాద్‌ అగిపోయిందని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు