కరంజ్‌ జలప్రవేశం

1 Feb, 2018 02:13 IST|Sakshi
ముంబై దగ్గర్లోని మజ్‌గావ్‌ డాక్‌ వద్ద జలాంతర్గామి కరంజ్‌

ముంబై: భారత నావికాదళంలో స్కార్పిన్‌ శ్రేణికి చెందిన మూడో అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ కరంజ్‌ జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌లాంబా భార్య రీనా లాంబా బుధవారం నాడిక్కడ ఐఎన్‌ఎస్‌ కరంజ్‌ను ప్రారంభించారు. ఫ్రెంచ్‌ నౌకా తయారీ సంస్థ డీసీఎన్‌ఎస్‌ భాగస్వామ్యంతో స్కార్పిన్‌ జలాంతర్గాముల్ని ముంబైలోని మజ్‌గావ్‌ డాక్‌ లిమిటెడ్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐఎన్‌ఎస్‌ కరంజ్‌తో నేవీలో మూడు స్కార్పిన్‌ శ్రేణి జలాంతర్గాములను ప్రవేశపెట్టినట్లయింది.

అనంతరం లాంబా మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిపాటు పరీక్షించిన తర్వాతే కరంజ్‌ను విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు. ఛత్రపతి శివాజీ నావికాదళం ఆధీనంలోని కరంజా ద్వీపం పేరు మీదుగా ఈ జలాంతర్గామికి ఐఎన్‌ఎస్‌ కరంజ్‌గా నామకరణం చేశామన్నారు. విధుల నుంచి తప్పించిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను వైజాగ్‌లో మ్యూజియంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చిందని, దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందితే విరాట్‌ను అప్పగించే విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు