నాడే భారత్‌ బిగ్‌ మార్కెట్‌!

8 Jul, 2019 18:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నాడు పలు ప్రపంచ దేశాల వర్తకులు సముద్ర మార్గాన వచ్చి భారత్‌తో జరిపిన వాణిజ్య లావాదేవీల గురించి ప్రస్తావనకు వచ్చిందంటే చాలు మనకు నాటి వలసపాలకులు గుర్తుకు వస్తారు. ముందుగా పోర్చుగీసు, ఆ తర్వాత డచ్, ఫ్రెంచ్, చివరకు బ్రిటీష్‌ వర్తకులు మలబార్, గోవా, గుజరాత్, బెంగాల్‌ సముద్ర మార్గాల ద్వారా  భారత్‌తో వ్యాపారం నిర్వహించడానికి వచ్చి వ్యాపార సంస్థల పేరుతో ఇక్కడే స్థిరపడడం, మన రాజకీయాల్లో జోక్యం చేసుకొని మనల్నే పాలించడం గుర్తుకురాక తప్పదు. ఇక్కడ ఈస్ట్‌ ఇండియా కంపెనీ గురించి ఏ బడి పిల్లవాడిని అడిగినా ఆ కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటీష్‌ వ్యాపారులు దాదాపు రెండు వందల సంవత్సరాలు మనల్ని పాలించారని చెబుతాడు.

నాటి వలసపాలన చీకటి రోజులు గుర్తుకు రావడం వల్ల అంతకుముందు పలు ప్రపంచ దేశాలు, భారత్‌ మధ్య భారీ ఎత్తున జరిగిన సముద్ర వాణిజ్యం గురించి పూర్తిగా మరచిపోతాం, పోయాం. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితమే భారత్, ఇతర దేశాల మధ్య భారీ ఎత్తున సముద్ర మార్గాన వాణిజ్య లావాదేవీలు కొనసాగాయి. పైగా నాడు ఆవిరితో నడిచే ఓడలు లేవు. కేవలం గాలి వాటున నడిచే చిన్న, మధ్యతరహా నౌకలు ఉండేవి. ఎండకాలంలో నైరుతి, చలిగాలంలో ఈశాన్య దిశ గాలులు ఏటవాలున నాటి వాణిజ్య తెరచాపల పడవలు ప్రయేణించేవి. ఆయా ప్రాంతాల్లోని దేశాలతోని వాణిజ్యం నెరపేవి. మొదట గ్రీకు వర్తకులు ఈజిప్లు, తూర్పు ఆఫ్రికా, దక్షిణ అరేబియా, భారత్‌తో వ్యాపారం నిర్వహించేవారు. వీరు తూర్పు ఆఫ్రికా తీరం నుంచి, అరేబియా ద్వీపకల్పం, పర్సియన్‌ గల్ఫ్‌ నుంచి, రెండు మార్గాల ద్వారా భారత్‌కు వచ్చేవారు. పలు మధ్యధరా సముద్ర తీర దేశాలు కూడా భారత్‌తో వర్తకం నిర్వహించేవి. విదేశీ సముద్ర వర్తకులు ఎక్కువగా హిందూ మహా సముద్ర నుంచి భారత్‌కు చేరుకునేవారు. అప్పట్లో భారత్‌తో భారుచ్‌ రేవు పట్టణం వాణజ్యానికి ప్రధాన కేంద్రం. మధ్యధరా సముద్ర తీర దేశాలు, భారత్, పర్షియా, ఆఫ్రికా, చైనా, ఆగ్నేయ ఆసియా దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలు కొనసాగాయి. భారత్‌లోని దాదాపు 20 రేవు పట్టణాలు నాడు వాణిజ్యానికి పేరు పొందాయి.

భారత్‌లోని మలబార్‌ తీరం నుంచి విదేశాలకు భారీ ఎత్తున మిరియాలు ఎగుమతయ్యేవి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాస్కోడిగామ భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొనడానికి కూడా ‘బ్లాక్‌ గోల్డ్‌’గా అభివర్ణించే మిరియాలే కారణమట. నాడు భారత్‌ నుంచి మిరియాలతోపాటు ఇతర మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలతోపాటు వివిధ రకాల అత్తర్లలో కలిపే సువాసన మూలకాలు, పత్తి, ఏనుగు దంతాలు, ముత్యాలు, చైనీస్‌ సిల్స్‌ భారత్‌ నుంచి ఎగుమతి అయ్యేవి. ఇక అరబ్‌ వ్యాపారులతోపాటు భారతీయ వ్యాపారులు కూడా బియ్యం, నువ్వుల నూనె, నెయ్యి, చక్కెర, కాటన్‌ గుడ్డలు విక్రయించేవారు. ఇటలీ, అరబ్‌ వైన్లు, ఆలివ్‌ నూనె, వెండి, గాజు పాత్రలతోపాటు భారతీయులు బానిస సంగీత కళాకారులు, వేశ్య వృత్తి కోసం అమ్మాయిలను కొనుగోలు చేసేవారు. రోమన్‌ బంగారు, వెండి నాణెలను భరతీయులు కొనుగోలు చేసేవారు. అటు సముద్ర దొంగలు, ప్రకృతి విలయాలను ఎదురొడ్డి నాడు వర్తకులు వ్యాపారం నిర్వహించాల్సి వచ్చేది. వస్తు మార్పిడి, నాటి నాణెంల ద్వారా వ్యాపార లావాదేవీలు నడిచేవి.

ఇవన్నీ ఎలా వెలుగులోకి వచ్చాయంటే..
‘పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రియన్‌ సీ’ పేరిట ఒకటవ శతాబ్దంలో, అంటే 1900 సంవత్సరాల క్రితం, వాస్కోడిగామా భారత్‌కు సముద్ర మార్గాన్ని కనుగొనడానికి 1400 ఏళ్ల ముందు ఓ గ్రీకు రచయిత గ్రీకు భాషలో చేతితో రాసిన పుస్తకం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదవ శతాబ్దంలో పైటపడిన ఆ రాతపతిని బ్రిటీష్‌ మ్యూజియలంలో భద్రపరిచారు. దాన్ని లింకన్‌ కాసన్‌ ఇటీవల ఆంగ్లంలోకి అనువదించారు. నాడు ఏయే దేశాలు ఏయే సముద్ర మార్గం గుండా భారత్‌కు వచ్చి వర్తకాన్ని నిర్వహించేవి. భారత్‌లో ప్రసిద్ధి చెందిన రేవులు, మార్కెట్లు, వాటి వివరాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. 1550 రూపాయల ధర కలిగిన ఈ పుస్తకాన్ని 33 శాతం నుంచి 25 శాతం వరకు తగ్గించి విక్రయించేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలు పోటీ పడుతున్నాయి.

మరిన్ని వార్తలు