ఐసిస్‌తో సంబంధాలున్నాయని..

11 Dec, 2015 19:27 IST|Sakshi
ఐసిస్‌తో సంబంధాలున్నాయని..

జైపూర్‌: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ మహమ్మద్‌ సిరాజుద్దీన్‌కు ఈ నెల 21 వరకు జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించినట్టు జైపూర్‌ పోలీసులు పేర్కొన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ఐఎస్‌ఐఎస్)తో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో అతడిని గురువారం జైపూర్‌లో రాజస్థాన్‌ పోలీసులు, తీవ్రవాద నిరోధక విభాగ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఐఎస్‌ఐఎస్ లో చేరేందుకు అతడు ఇటీవల హైదరాబాద్‌ యువతితో చాటింగ్‌ చేసినట్టు తెలిసింది.

దాంతో రంగంలోకి దిగిన జైపూర్‌ పోలీసులు, తీవ్రవాద నిరోధక విభాగం చట్ట వ్యతిరేక కార్యకలాపాల కింద సిరాజుద్దీన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన సిరాజుద్దీన్‌ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ.. సామాజిక వెబ్‌సైట్లలో ఫోటోలు, వీడియోలను పోస్టు చేసినట్టు పోలీస్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఐసిస్‌కు సంబంధించిన ఓ మ్యాగజైన్‌ను కూడా డౌన్‌లోడ్‌ చేసినట్టు తెలిపారు. మహమ్మద్‌ సిరాజుద్దీన్‌ భారత్‌ సహా ఇతర దేశాలలో ఆన్‌లైన్‌ ద్వారా తీవ్రవాద సంస్థతో సంబంధాలను పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు