రైల్వే టీటీఈలకు కొత్త మార్గదర్శకాలు

30 May, 2020 05:50 IST|Sakshi

న్యూఢిల్లీ: 137 ఏళ్లుగా రైల్లో తెల్ల డ్రెస్సుపై నల్ల కోటు ధరించి దగ్గరికొచ్చి టికెట్‌ చెక్‌ చేసే రైల్వే టికెట్‌ కలెక్టర్‌ రూపం కరోనా కారణంగా మారిపోనుంది. వీరికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను రైల్వే బోర్డు విడుదల చేసింది. ఇకపై వారు చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్కులు ధరించి దూరంగా నిలబడి భూతద్దం ద్వారా టికెట్లను పరిశీలించనున్నారు. జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్న 100 జంట రైళ్లలో వీరు ఈ విధంగా కనిపించే అవకాశం ఉంది. కరోనా ముప్పును తగ్గించేందుకు టై, కోటును ధరించకుండా విధులు నిర్వహించాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అయితే పేరు కలిగిన ప్లేట్‌ మాత్రం ధరిస్తారని చెప్పింది. విధుల్లోకి వెళ్లే ముందు వీరికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయనున్నారు. ఒకవేళ ఉద్యోగులకు శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉంటే ముందే చెప్పాల్సిందిగా కోరింది. వారికి తగిన మాస్కులు, ముఖానికి అడ్డు పెట్టుకునే కవచాలు, గ్లౌజులు, తలకు ధరించే కవర్లు, శానిటైజర్లు, సోపులు అందించనున్నట్లు చెప్పింది. టికెట్లను పరిశీలించేందుకు భూతద్దం ఇవ్వనున్నట్లు చెప్పింది. టికెట్లను తాకకుండా పరిశీలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి సీనియర్‌ టికెట్‌ కలెక్టర్‌ ఇంచార్జ్‌  బాధ్యతలు తీసుకోనున్నారు.
 

అవి రెగ్యులర్‌ రైళ్లు కాదు
వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు చేరవేయడానికి ప్రవేశపెట్టిన శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లువెత్తుతున్న విమర్శలపై రైల్వేశాఖ వివరణ ఇచ్చింది. అవి రెగ్యులర్‌ రైళ్లు కాదని, వలస కూలీల అవసరాన్ని బట్టి వాటి గమ్యస్థానాన్ని పొడిగించడం లేదా కుదించడం.. దారి మళ్లించడం వంటివి చేస్తున్నామని, అందువల్లే కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. మే 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా 3,840 ప్రత్యేక రైళ్లు నడిపామని, వీటిలో 52 లక్షల మంది ప్రయాణించారని రైల్వేబోర్డు చైర్మన్‌ వి.కె.యాదవ్‌ చెప్పారు.   అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు శ్రామిక్‌ రైళ్లలో ప్రయాణించకపోవడమే మంచిదని సూచించింది. మే 27న ఈ రైళ్లలో మరణించిన తొమ్మిది మందికి అంతకు ముందే ఆరోగ్య సమస్యలున్నట్టు తేలిందని వెల్లడించింది. ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్‌ నంబర్లు 139, 138కు ఫోన్‌ చేయాలని కోరింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు