రైల్వేలో వినూత్నంగా గాంధీ జయంతి

13 Aug, 2019 08:40 IST|Sakshi

న్యూఢిల్లీ: గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని పలు వినూత్న కార్యక్రమలు చేపట్టేందుకు భారత రైల్వే సిద్ధమైంది. అక్టోబర్‌ 2ను ‘కమ్యూనిటీ రోజు’గా వ్యవహరించడంతో పాటు రైల్వే అధికారులంతా స్వచ్ఛంద సేవ చేసే విధంగా కార్యక్రమాలు ఉండనున్నాయి. ‘మోహన్‌ దాస్‌ నుంచి మహాత్మా వరకు’ అన్న పేరుతో, రైల్వేతో ముడిపడి ఉన్న గాంధీ జీవితంలోని ప్రధాన సందర్భాలను చూపించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే శాఖ ఇప్పటికే దేశంలోని అన్ని రైల్వే జోన్లకు పంపింది.

రైల్వే హెడ్‌క్వార్టర్లు, వర్క్‌షాప్‌లలో గాంధీ చెప్పిన సూక్తులను ఉంచనున్నారు. అక్టోబర్‌ 2నుంచి ప్రభుత్వానికి చెందిన సోషల్‌మీడియా ఖాతాలలో గాంధీ చెప్పిన మాటలను, సూక్తులను ప్రతిరోజు ఒకే సమయంలో పోస్ట్‌ చేయాలని కమిటీలో నిర్ణయించారు. గాంధీ ఆశయాలను కొనసాగించాలని ప్రధాన మంత్రి అధ్యక్షతన గతేడాదే ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో ప్రముఖ గాంధేయవాదులు, సమాజ సేవకులు కూడా ఉన్నారు.  

>
మరిన్ని వార్తలు