ఐఆర్‌సీటీసీ ప్రైవేటుపరం కానుందా ?!

3 Jul, 2019 18:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ కలిగిన వ్యవస్థ భారతీయ రైల్వేది. 20 వేలకు పైగా రైళ్లు ఏటా 811.6 కోట్ల మంది ప్రయాణికులను మోసుకెళుతున్నాయి. 110.6 కోట్ల టన్నుల సరకులను తరలిస్తున్నాయి. మొత్తానికి భారతీయ రైల్వే లాభాల్లో కాకుండా నష్టాల్లో నడుస్తుండడంతో రైల్వేను ప్రైవేటీకరించాలన్న మాట అప్పుడప్పుడు వినిపిస్తోంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో రైళ్లను ప్రవేటీకరిస్తారంటూ జూన్‌ 26వ తేదీన ఓ ఆంగ్ల పత్రికలో ఓ వార్త వచ్చింది. ఆ తర్వాత రెండు రోజులకు అలాంటి ఆలోచన లేదని కేంద్ర రైల్వే మంత్రి పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. అయినప్పటికీ దేశంలోని ఐదు రైళ్ల ఉత్పత్తి కేంద్రాలను మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని, మొత్తం రైల్వేను ప్రైవేటీకరించాలనే ఆలోచనలో ఇది భాగమంటూ మంగళవారం లోక్‌సభలో సోనియాగాంధీ ఆరోపించారు. అలాంటిదేమీ లేదంటూ ఆమె ఆరోపణలను రైల్వే మంత్రి కొట్టిపారేశారు. ప్రయోగాత్మకంగా క్యాటరింగ్‌ సర్వీసును, రైల్వే టిక్కెటింగ్‌ కార్పొరేషన్‌ను ప్రైవేటీకరించాలనుకుంటున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన కొట్టివేయ లేదు. ఐఆర్‌సీటీసీగా వ్యవహరించే ‘ఇండియన్‌ రైల్వేస్‌ క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌)’ ఆన్‌లైన్‌ ద్వారా రైల్వే టిక్కెట్లను విక్రయించడం కూడా చేపట్టి అందులో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.

ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ టిక్కెట్‌ అమ్మకాల విధానాన్ని ప్రారంభించడానికి ముందు ప్రయాణికులు టిక్కెట్ల కోసం కౌంటర్ల ముందు బారులు తీరి నిలబడాల్సి వచ్చేది. ఏజెంట్లకు భారీగా కమీషన్లు ఇవ్వాల్సి వచ్చేది. ‘ఢిల్లీ నుంచి చెన్నైకి రైళ్లో వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్‌ చేసుకోవడం అన్నది ఒకప్పుడు ఊహకు కూడా అందని ఆలోచన’ అని 2001 నుంచి 2006 వరకు రైల్వే ఐటీ సర్వీసుల జనరల్‌ మేనేజర్‌గా పనిచేసిన అమితాబ్‌ పాండే వ్యాఖ్యానించారు.

క్యాటరింగ్, టూరిజం సేవలు
ఐఆర్‌సీటీసీ పేరుకు తగ్గట్టుగానే టిక్కెట్ల అమ్మకం కన్న క్యాటరింగ్, టూరిజం సేవలను ఎక్కువ అందిస్తోంది. రైళ్లలో ఆహారాన్ని సరఫరా చేయడంతోపాటు రైల్లే స్టేషన్లలో ఫుడ్‌ కోర్టులను నిర్వహిస్తోంది. రైల్వేకున్న ఖాళీ స్థలాల్లో బడ్జెట్‌ హోటళ్లను కూడా నడుపుతోంది. కేవలం క్యాటరింగ్‌ సర్వీసుల కోసమే ఐఆర్‌సీటీసీని 1999లో ఏర్పాటు చేసినట్లు అమితాబ్‌ పాండే తెలిపారు. భారతీయ రైల్వేలో డేటా నిక్షిప్తం కోసం కంప్యూటర్లను వాడడం 1980 దశకంలోనే ప్రారంభమైందని, ఆన్‌లైన్‌లో టిక్కెట్ల అమ్మకాలను ఐఆసీటీసీ 2002లో ప్రారంభించిందని పాండే తెలిపారు. మొదట్లో ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ చేసినవారికి ఎలా టిక్కెట్‌ అందజేయాలో తెలిసేది కాదని, అప్పటికి సెల్‌ఫోన్లలో ఎస్‌ఎంఎస్‌ సర్వీసు ప్రారంభం కాలేదని, దాంతో టిక్కెట్లను ప్రింట్‌చేసి వాటిని ప్రయాణికులకు అందజేయడానికి కొరియర్లను నియమించుకన్నామని పాండే తెలిపారు. కొరియర్లు ఒకటి, రెండు రోజుల్లో ప్రయాణికులకు టిక్కెట్లను అందజేసే వారిని వివరించారు.

ఐఆర్‌సీటీసీ లాభాల్లో ఉందా?
2017–18 వార్షిక నివేదిక ప్రకారం ఐఆర్‌సీటీసీ టర్నోవర్‌ 1468.1 కోట్ల రూపాయలుకాగా, 693 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం టిక్కెట్‌ బుకింగ్‌లపై సర్వీసు చార్జీలను 2016, నవంబర్‌ నుంచి తొలగించడం వల్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ప్రతి ఏసీ బుకింగ్‌ టిక్కెట్‌పై 40 రూపాయలు, నాన్‌ఏసీ టిక్కెట్‌పై 20 రూపాయల చొప్పున సర్వీసు చార్జీలు వసూలు చేసేవారు. 2016–17లో టిక్కెట్ల అమ్మకం ద్వారా 24,485 కోట్ల రూపాయలు రాగా సర్వీసు చార్జీల ద్వారా 416 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆ ఏడాది యాభై శాతం రెవెన్యూను రైల్వే మంత్రిత్వ శాఖతో పంచుకున్నప్పటికీ సంస్థకు 211 కోట్ల రూపాయల లాభం వచ్చింది. సర్వీసు చార్జీలను రద్దు చేసనప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఆర్‌సీటీసీకి లాభాలు రాలేదు. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో దేశంలో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నాడు సర్వీసు చార్జీలను రద్దు చేసింది.

క్యాటరింగ్‌ ద్వారానే ఎక్కువ లాభం
సంస్థకు వచ్చే రెవెన్యూలో టిక్కెట్ల అమ్మకం ద్వారా వచ్చేది చాలా తక్కువ. యాభై శాతం రెవెన్యూ క్యాటరింగ్‌ ద్వారానే వస్తోంది. 2017–18 సంవత్సరానికి 48.2 శాతం రెవెన్యూ క్యాటరింగ్‌ ద్వారానే వచ్చింది. లాభం కూడా ఎక్కువగానే ఉండేది. 2005లో రైళ్లలో క్యాటరింగ్‌ సర్వీసుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టులకు ఇచ్చారు. లాభాలకు ఆశపడిన ప్రైవేటు సంస్థలు నాసిరకం ఆహారాన్ని సరఫరా చే స్తూ అధిక డబ్బులు వసూలు చే స్తున్నాయన్న ఆరోపణలు రావడంతో 2009లో అప్పటి కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ తిరిగి క్యాటరింగ్‌ పూర్తి బాధ్యతలను తిరిగి ఐఆర్‌సీటీసీకే అప్పగించారు. ఆ తర్వాత కూడా ఎన్నో మార్పులు జరిగాక ఫుడ్‌ కోర్టులు, ఫ్లాజాలు, ఫాస్ట్‌ఫుడ్‌ యూనిట్లకు పరిమితం చేసిన ఐఆర్‌సీటీసీకే రైల్వే క్యాటరింగ్‌ బాధ్యతలు మళ్లీ అప్పగించారు.

రైల్వే క్యాటరింగ్, టూరిజం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకరావడం కోసం ప్రయోగాత్మకంగా ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త కార్పొరేట్‌ సంస్థను ఏర్పాటు చేసి దానికి అప్పగిస్తారని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ తెలియజేస్తోంది. అదే జరిగితే లాభాల మాట ఏమిటోగానీ వినియోగదారుల జేబుకు చిల్లు పడడం ఖాయం.

>
మరిన్ని వార్తలు