కేంద్ర మంత్రికి ట్వీట్‌.. అర్ధగంటలో స్టాల్‌ సీజ్‌

6 Feb, 2019 09:52 IST|Sakshi

రైళ్లలో ట్విట్టర్‌ వేదికగా ఫిర్యాదులు

నిమిషాల్లో సమస్యల పరిష్కారం

రైల్వేమంత్రి  పర్యవేక్షణే కారణం

తిరుపతిలోని రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న క్యాంటీన్‌లో బిస్కెట్‌ ప్యాకెట్‌ను ఎమ్మార్పీ కంటే అధికధరలకు విక్రయిస్తున్నారంటూ వినియోగదారుడు రైల్వే మంత్రికి ట్వీట్‌ చేయడంతో.. అర్ధగంటలో స్టాల్‌ను సీజ్‌ చేశారు.’


 ‘హైదరాబాద్‌ నుంచి రేణిగుంటకు రైల్లో ప్రయాణిస్తున్న ఓ 20 ఏళ్ల యువతి ఎదురుగా మరో వ్యక్తి కూర్చున్నాడు. ఆ బోగీలో పెద్దగా ప్రయాణికులు లేకపోవడం, వ్యక్తి చూపులు అనుమానంగా ఉండడంతో భయపడ్డ యువతి వెంటనే సమస్యను మంత్రికి ట్వీట్‌ చేసింది. 12 నిమిషాల తరువాత ఓ స్టేషన్‌ రాగా ఆ వ్యక్తిని రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతికి స్వయాన రైల్వే మంత్రి ఫోన్‌ చేసి అభినందించడం ఇటీవల పత్రికల్లో చదివే ఉంటాం’

 ‘ఇటీవల చెన్నై నుంచి విజయవాడ మీదుగా వెళుతున్న రైల్లో ఫ్యాను పనిచేయడం లేదని ఓ ప్రయాణికుడు స్మార్ట్‌ఫోన్‌ నుంచి ట్విట్టర్‌ ద్వారా రైల్వే మంత్రికి ట్వీట్‌ పంపాడు. నిముషాల వ్యవధిలో విజయవాడ సీనియర్‌ డీఈఈకు సమాచారం అందడంతో విద్యుత్‌ సిబ్బంది రైలు వద్దకు చేరుకుని ఫ్యాన్‌ మరమ్మతు చేశారు.’

 ‘రెండు రోజుల కిందట బెంగళూరు నుంచి బళ్లారికి రాత్రి వేళ రైల్లో వెళుతున్న ఓ యువతి నెలసరి సమస్యతో బాధపడుతుంటే.. ఆమె స్నేహితురాలు రైల్వే మంత్రికి ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. రైల్వే మంత్రి సూచనతో రంగంలోకి దిగిన అధికారులు ఆరు నిముషాల్లో ఈమె ప్రయాణిస్తున్న బోగి వద్దకు వచ్చి కావాల్సిన శానిటరీ నాప్కిన్లు, మాత్రలు ఇచ్చి వెళ్లారు.’ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే కలిగే మేలు ఎలా ఉంటుందో చెప్పడానికి ఇవి మచ్చుకలు మాత్రమే. ఇటీవల రైళ్లలో ఎదురవుతున్న సమస్యలపై ట్విట్టర్‌ ద్వారా రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళుతుంటే అప్పటికప్పుడే  పరిష్కరిస్తుండడం వల్ల రైళ్లలో ప్రయాణికుల సంఖ్య పెరగడంతోపాటు సంస్థపై జనానికి నమ్మకం కలుగుతోంది. అందుబాటులో ఉన్న సేవలను ఉపయోగించుకోవడంలో విద్యావంతులు తమదైనశైలి మార్కు వేస్తున్నారు.

సోషల్‌ మీడియా సత్తా..
రైళ్లలో ప్రయాణించేటప్పుడు చాలా మందికి వివిధ రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. క్యాటరింగ్‌లో పాచిన ఆహారం ఇవ్వడం, మరుగుదొడ్ల నుంచి దుర్గంధం వస్తున్నా పట్టించుకోకపోవడం, ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడం లాంటి ఘటనలు చాలానే ఎదురవుతుంటాయి. వీటిని ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక కొందరు.. స్టేషన్లలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మరికొందరు సమస్యను ప్రశ్నించడమే మానేస్తుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సమస్యల ప్రస్తావనకు సోషల్‌ మీడియా మంచి మాధ్యమంగా మారుతోంది. సామాన్య మధ్యతరగతి ప్రజల చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు ఉండడం సత్ఫలితాలను ఇస్తున్నాయి. రైలు ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళుతున్న ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి. ప్రధానంగా సమస్యలను రైల్వేశాఖ మంత్రికి క్షణాల్లో చెప్పడం.. నిమిషాల్లో ఇవి పరిష్కారానికి నోచుకుంటుండడంతో ప్రజలు సైతం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

24 గంటల పర్యవేక్షణ..
ట్విట్టర్‌లో  రైల్వే మంత్రికి అందే ఫిర్యాదులను ఢిల్లీలోని రైల్‌ భవన్‌ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ఇది 24 గంటల పాటు పనిచేసే సెంట్రల్‌ వ్యవస్థ. రైలు ప్రయాణికులు పంపే ఫిర్యాదులను రైల్వే మంత్రి చూడడంతో పాటు.. రైల్‌ భవన్‌లోని అధికారులు సైతం ఫిర్యాదులు చూస్తూ ఉంటారు. ట్విట్టర్‌ వేదికగా వచ్చే ఫిర్యాదులు, సూచనలపై అప్పటికప్పుడు సానుకూల స్పందన వస్తుండడం ప్రయాణికులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.

ఎలాంటి సమస్యలంటే...

  • రైల్లో దొంగతనాలు జరుగుతున్నా సిబ్బంది స్పందిచకపోవడ
  • అనుమానిత వ్యక్తులు మన పక్కన ఉన్నప్పుడు.. అసాంఘిక కార్యకలాపాలు రైల్లో జరుగుతున్నప్పుడు
  • రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోవడం, క్యాంటీన్లలో ఎమ్మార్పీ కన్నా అధిక ధరలు వసూలు చేసినా
  • ప్లాట్‌ఫామ్‌పై నీళ్లు రాకపోయినా, రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల వసతులు సరిలేకపోయినా, అసౌకర్యాలపై
  • రైల్లో ప్రయాణికులు అనారోగ్యానికి గురైనా, మహిళలు, దివ్యాంగుల బోగీల్లో ఇతరులు ఎక్కినా ఫిర్యాదులు చేయొచ్చు.
  • ఇలాంటివే ఫిర్యాదు చేయాలి.. ఇలాంటి చేయకూడదని లేదు. కానీ ఫిర్యాదు చేసేటప్పుడు కాస్త విజ్ఞతతో ఆలోచిస్తే సరి.
  • ట్వీట్‌ చేసేటప్పుడు తప్పనిసరిగా పేరు, ఫోన్‌ నంబరు నమోదు చేయాలి. అలాగే ప్రయాణి కుల బెర్తు, బోగీ కూడా రాయాలి.

మీరూ ట్విట్టండి..
స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌  ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా ట్విట్టర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ట్విట్టర్‌లో వ్యక్తి పేరు, పాస్‌వర్డ్, మెయిల్‌ అడ్రస్, ఫోన్‌ నెంబర్‌ నమోదు చేసి సేవ్‌ చేసుకున్న తరువాత ట్విట్టర్‌ వినియోగంలోకి వస్తుంది. అనంతరం రైల్వే మినిస్టర్‌ అని టైప్‌చేస్తే రైల్వేమంత్రి పీయుష్‌ గోయల్‌ చిత్రంతో పాటు సైట్‌ ఓపెన్‌ అవుతుంది. ప్రయాణికులు తమకు తెలిసిన భాషల్లో సమస్యలను నేరుగా మంత్రికి ట్వీట్‌ రూపంలో తెలియచేయొచ్చు. ట్వీట్‌ మెసేజ్‌ సెకన్ల వ్యవధిలోనే ఆయా డివిజన్ల రైల్వే ఉన్నతాధికారులకు చేరుతుంది. అర్ధరాత్రులు సైతం అధికారులు స్పందిస్తారు. మెసేజ్‌ చేరగానే అప్రమత్తమై ప్రయాణికుల సమస్యలను పరిష్కరించి తిరిగి రైల్వే మంత్రికి నివేదిస్తారు.

>
మరిన్ని వార్తలు