నూరుశాతం సమయపాలన సాధించిన రైల్వేలు

2 Jul, 2020 15:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రైల్వేల చరిత్రలోనే తొలిసారిగా ఈనెల 1న అన్ని రైళ్లు నూరు శాతం సరైన సమయపాలన పాటించాయని భారతీయ రైల్వేలు వెల్లడించాయి. ఈరోజున దేశవ్యాప్తంగా నడిచిన 201 రైళ్లలో ఏ ఒక్కటీ ఆలస్యంగా నడవలేదని రైల్వేలు స్పష్టం చేశాయి. భారత రైల్వేలు నూరుశాతం సమయపాలన పాటిస్తూ చరిత్ర సృష్టించాయని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సాధారణ ప్రయాణీకుల రైళ్లను రద్దు చేసిన రైల్వేలు పరిమిత స్ధాయిలో రైళ్లను నడుపుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు,ఇతరులను తరలించేందుకు రైల్వేలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. నిర్ధిష్ట రూట్లలోనే ఈ రైళ్లు నడుస్తున్నాయి.

గతంలో జూన్‌ 23న 99.54 శాతంతో రైళ్లలో సమయపాలన మెరుగ్గా ఉందని ప్రకటించగా తాజాగా జులై 1న మొత్తం 201 రైళ్లు సకాలంలో రాకపోకలు సాగించడంతో నూరు శాతం సమయపాలన సాధించినట్టు రైల్వేలు వెల్లడించాయి. కాగా 109 రూట్లలో 151 ఆధునిక రైళ్లతో పాసింజర్‌ రైళ్లను ప్రైవేట్‌ రంగంలో అనుమతించే ప్రక్రియను రైల్వేలు బుధవారం లాంచనంగా ప్రారంభించాయి. ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రైవేట్‌ ఆపరేటర్ల నుంచి రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్స్‌ (ఆర్‌ఎఫ్‌క్యూ)ను రైల్వేలు ఆహ్వానించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రైల్వేల్లో 30,000 కోట్ల రూపాయల ప్రైవేట్‌ పెట్టుబడులు రానున్నాయి. 

చదవండి : అత్యవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు!

మరిన్ని వార్తలు