ఆ రైళ్లకు వెయిటింగ్ లిస్టు టికెట్లు ఇక ఉండవు!

23 May, 2016 17:27 IST|Sakshi
ఆ రైళ్లకు వెయిటింగ్ లిస్టు టికెట్లు ఇక ఉండవు!

న్యూఢిల్లీ: భారతీయ రైల్వేశాఖ టికెట్ల జారీ, రీ ఫండ్‌కు సంబంధించి సరికొత్త నియమాలను ప్రవేశపెట్టింది. జులై 1 నుంచి అమలులోకి రానున్న ఈ నియమాలతో రైలు ప్రయాణికులకు కొన్ని లాభాలు కనిపించినా, కొన్ని విషయాల్లో మాత్రం సాధారణ ప్రయాణికులకు నష్టం కలిగించేలాగే ఉన్నాయి. ప్రధానంగా సువిధ రైళ్లలో వెయిటింగ్ లిస్టు టికెట్ల జారీని పూర్తిగా రద్దు చేస్తున్నారు. వాటిలో కేవలం ఆర్‌ఏసీ టికెట్లను మాత్రమే ఇస్తారట. దాంతోపాటు, టికెట్లు రద్దు చేసుకున్నవారికి తిరిగిచ్చే రీఫండ్ విషయంలో కూడా నిబంధనలు మారాయి. మారిన కొత్త నిబంధనలు ఏంటో ఓసారి చూద్దాం..


- తత్కాల్ టికెట్లను రద్దు చేసుకునే ప్రయాణికులు టికెట్ ధరలో 50 శాతం తిరిగి పొందనున్నారు. ఇంతకుముందు తత్కాల్ టికెట్లు రద్దు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా వెనక్కి తిరిగి వచ్చేది కాదు.
- ఉదయం 10 గంటల నుంచి 11 వరకు కేవలం ఏసీ తత్కాల్ టికెట్లకు, 11 గంటల నుంచి 12 గంటల వరకు తత్కాల్ సాధారణ టికెట్లను అమ్మకానికి ఉంచనున్నారు.

- సువిధ టికెట్లను క్యాన్సిల్ చేసుకునే ప్రయాణికులు టికెట్ ధరలో 50 శాతం తిరిగి పొందనున్నారు.
- ఏసీ టైర్-1 లేదా టైర్ 2 టికెట్ ను కేన్సిల్ చేసుకునేవారు వందకి 50 రూపాయల చొప్పున తిరిగి పొందనున్నారు. ఏసీ టైర్-3, చైర్ కార్, ఎకానమీ, టికెట్ ను కేన్సిల్ చేసుకున్న ప్రయాణికులు వందకు 90 రూపాయలు, స్లీపర్ క్లాస్ ప్రయాణికులు వందకు 60 రూపాయలను తిరిగి పొందనున్నారు.
- ఇక నుంచి సువిధ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ టికెట్ల జారీకి రైల్వేశాఖ ఉద్వాసన పలికింది. వాటిలో కేవలం రిజర్వేషన్ అగైనెస్ట్ కేన్సిలేషన్ (ఆర్ఏసీ) ఆప్షన్ అందుబాటులో ఉండనుంది.
- రాజధాని, శతాబ్ది రైళ్లలో బోగీల సంఖ్య పెరగనుంది.
- రాజధాని, శతాబ్ది రైళ్లలో మొబైల్ టికెట్లను అందుబాటులోకి తేనున్నారు.
- కేవలం ఇంగ్లీషులోనే అందుబాటులో ఉన్న రైల్వే టికెట్ బుకింగ్ వెబ్ సైట్ ను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తేనున్నారు.
- ప్రస్తుతం రైల్వే శాఖ నడుపుతున్న ప్రీమియం రైళ్లు పూర్తిగా రద్దు కానున్నాయి.

మరిన్ని వార్తలు