బోగీల్లో 20 వేల ఐసోలేషన్‌ పడకలు!

31 Mar, 2020 04:20 IST|Sakshi
రైలు బోగీల్లో బెడ్లను అమర్చుతున్న చెన్నైలో దక్షిణ రైల్వే ఉద్యోగులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యలో దేశవ్యాప్తంగా కనీసం 20 వేల రైల్వే బోగీలను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చేందుకు సిద్ధంగా ఉండాలని∙రైల్వే బోర్డు ప్రాంతీయ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. జోనల్‌ రైల్వే మేనేజర్లందరికీ సోమవారం రాసిన ఒక లేఖ ప్రకారం కోవిడ్‌ బాధితులకు చికిత్స అందించేందుకు ముందుగా 5000 రైల్వే బోగీలను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చాల్సి ఉంటుందని రైల్వే బోర్డు తెలిపింది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించింది.

ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌తోపాటు వేర్వేరు రైల్వే జోన్లు, ఆయుష్మాన్‌ భారత్‌ వర్గాలతో సంప్రదింపులు జరిపినట్లు బోర్డు తెలిపింది. దేశం మొత్తమ్మీద ఐదు రైల్వే జోన్లు ఇప్పటికే నమూనా ఐసోలేషన్‌ వార్డులను సిద్ధం చేశాయని బోర్డు తెలిపింది. కోవిడ్‌ను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా మార్చి 25న జరిగిన ఒక వీడియో సమావేశంలో కొన్ని బోగీలను క్వారంటైన్, ఐసోలేషన్‌ వార్డులుగా మార్చాల్సి ఉంటుందని నిర్ణయించాం. ఇందులో భాగంగా నాన్‌ ఏసీ, స్లీపర్‌ బోగీలను వాడాలని తీర్మానించాం అని ఈ లేఖలో పేర్కొన్నారు. ఐసోలేషన్‌ వార్డులో ఏమేం ఉండాలన్న విషయాలను కూడా ఈ లేఖలో విపులీకరించారు. చెక్క పలక ఒకదాన్ని పరచడం ద్వారా ఒక టాయిలెట్‌ను స్నానాలగదిగా మారుస్తారు.

దీంతో అడుగుభాగం మొత్తం చదునుగా ఉంటుంది. ఇందులోనే ఒక బకెట్, మగ్, సోప్‌ డిస్పెన్సర్‌ ఉంచుతారు. వాష్‌బేసిన్లలోని కుళాయిలను మారుస్తారు. బాత్రూమ్‌ సమీపంలోని తొలి కేబిన్‌ వద్ద ఆసుపత్రుల్లో వాడే తెరలను ఉపయోగిస్తారు. తొలి కేబిన్‌లో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది సామాగ్రి ఉంటుంది. ఇదే కేబిన్‌లో ఆక్సిజన్‌ సిలిండర్లను బిగించాల్సి ఉంటుంది. మధ్యలో ఉండే బెర్త్‌లను తొలగిస్తారు. ప్రతి కేబిన్‌లోనూ అదనంగా బాటిల్‌ హోల్డర్లను ఏర్పాటు చేస్తారు. కిటికీలపై దోమతెరలు ఏర్పాటవుతాయి. ప్రతి కేబిన్‌లో డస్ట్‌బిన్స్, బయటి వేడి తగలకుండా వెదురు లేదా వట్టివేళ్లవంటివి కేబిన్‌ పైన, కింద అమరుస్తారు. ల్యాప్‌టాప్, మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్లన్నీ పని చేస్తాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా