అయ్యయ్యో... బోగీలు కనబడడం లేదు..!

8 Jun, 2018 00:48 IST|Sakshi

రైళ్లలో ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, నల్లాలు, కొన్ని సందర్భాల్లో వాష్‌ బేసిన్లు సైతం చోరీకి గురికావడం, ఏసీ రైళ్లలోనైతే చేతి తువాళ్లు, బ్లాంకెట్లు వంటివి మాయమవుతున్న ఘటనలు ఇతర దేశాల్లోనైతే ఆశ్చర్యంగా చూస్తారు కాని... ఇక్కడైతే ఇదంతా మామూలే అన్నట్టుగా మనవాళ్లు పెద్దగా పట్టించుకోరు. రైళ్లలో ప్రవేశపెట్టిన ‘బయో టాయ్‌లెట్ల’లోని స్టెయిన్‌లెస్‌స్టీల్‌ డస్ట్‌బిన్‌లు కూడా దొంగతనానికి గురవుతున్న జాబితాలో చేరిపోయాయి.  అయితే తాజాగా ఏకంగా రైలు బోగీలే అవీ కూడా ఏసీ కోచ్‌లు కొన్ని కనిపించకుండా పోయాయనే వార్తలు నోళ్లు వెళ్లబెట్టేలా చేస్తున్నాయి. 

వీటి ప్రకారం రాంచీ–న్యూఢిల్లీల మధ్య నడిచే రాజధాని, సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు సంబంధించిన కొన్ని కొత్త బోగీలు రాంచీ రైల్వే డివిజన్‌ యార్డు నుంచి మాయమై పోయాయి. ఈవిధంగా కొన్ని బోగీలకు బోగీలే కనబడకుండా పోవడం పెద్ద కలకలాన్నే సృష్టించింది.  రాజధాని, సంపర్క్‌ క్రాంతి రైళ్లలో జతచేయాల్సిన ఈ బోగీలు మిస్‌ కావడంతో వాటి స్థానంలో పాత రైలు డబ్బాలతోనే రైల్వేశాఖ పని కానీచ్చేస్తోంది. ఇటీవల రాంఛీ నుంచి బయలుదేరాల్సిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మూడోబోగీలు కదలకుండా మొరాయించడంతో ప్రయాణీకులు పెట్టిన గగ్గోలు అంతా ఇంతా కాదు.

అధునాతన సౌకర్యాలున్న రైళ్లుగా పరిగణిస్తున్న రాజధాని వంటి రైళ్ల కోసం తెప్పించిన కొత్త కోచ్‌లు ఏమయ్యయో తెలియక అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రైలు డబ్బాలు కనిపించకుండా పోవడం వెనక పెద్ద ముఠాయే పనిచేస్తున్నట్టు ఉందని సందేహాలు వ్యక్తం చేస్తున్న వారూ ఉన్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఫిర్యాదు కూడా చేసినట్టు చెబుతున్నారు. అంతకు ముందు కూడా ఒకటో రెండో ఇలాంటి ఘటనలు  జరిగినా ఇప్పుడు ఏకంగా కొన్ని ఏసీ బోగీలే కనిపించకుండా పోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

అయితే ఏసీ బోగీలు కనబడకుండా పోయాయన్న వార్తలపై రాంచీ డివిజన్‌ అధికారి స్పందించినట్టు ఓ పత్రిక వెల్లడించింది. ‘తమ డివిజన్‌లోనే వీటిని ఉపయోగిస్తున్నట్టు మేము మార్క్‌ చేశాం. ఈ కోచ్‌లు ఉత్తరాది డివిజన్‌లో వినియోగంలో ఉన్నట్టుగా భావిస్తున్నాం. ఈ ఏసీ బోగీలను తిరిగి తమకు అప్పగించాలంటూ ఉత్తరాది రైల్వేకి ఆగ్నేయ రైల్వే లేఖ రాసింది. త్వరలోనే అవి వెనక్కు వస్తాయని ఆశిస్తున్నాం’ ఆ అధికారి పేర్కొన్నట్టు తెలిపింది. 

చిన్న చిన్న చోరీలు ఎక్కువే...
2016 నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో నివేదిక ప్రకారం...2015లో రైళ్లలో  చోటుచేసుకున్న చోరీ కేసులు 9.42 లక్షలుండగా, 2016లో ఈ సంఖ్య11 లక్షలకు చేరుకుంది. వీటిలో 2 లక్షల కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో, 1.24 లక్షల కేసులతో ఉత్తరప్రదేశ్‌ రెండోస్థానంలో నిలిచాయి. 2016–17లో చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ కోచింగ్‌ డిపో పరిధిలో 817 బయో టాయ్‌లెట్లున్నాయి. దీని పరిధిలో 3,601 స్టీల్‌ డస్ట్‌బిన్‌లు కనబడకుండా పోయినట్లు ఫిర్యాదు చేశారు. పశ్చిమబెంగాల్‌లోని సీయల్‌దా కోచింగ్‌ డిపో పరిధిలో 1,304 బయో టాయ్‌లెట్లుండగా 3,536 చోరీకి గురైనట్టు అధికారులు తెలిపారు. 

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు