భారీ డిస్కౌంట్‌ ప్రకటించిన రైల్వే

22 Oct, 2018 18:43 IST|Sakshi

ముంబై : భారతీయ రైల్వే సంస్థ కొన్ని ప్రయోజనాల దృష్ట్యా విద్యార్థులకు భారీ డిస్కౌంట్‌ని అందించనున్నట్లు తెలిసింది. వివిధ వర్గాల విద్యార్థులకు వేర్వేరు రాయితీలు ప్రకటించింది. వివిధ అవసరాల దృష్ట్యా ప్రతి రోజు రైల్వేలో ప్రయాణిస్తున్న విద్యార్థుల కోసం 25 శాతం నుంచి పూర్తి ఉచిత ప్రయాణ సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపింది.

రాయితీల వివరాలు...
1. ప్రతి రోజు జనరల్‌ క్లాస్‌లో ఎమ్‌ఎస్‌టీ(మంత్లీ సీజన్‌ టికెట్‌/ నెల పాస్‌ లాంటిది) మీద ప్రయాణించే అమ్మాయిల కోసం ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. బాలికలు పాఠశాల విద్య నుంచి గ్రాడ్యుయేషన్‌ అయిపోయేంత వరకూ ప్రతి రోజు జనరల్‌ క్లాస్‌లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. అబ్బాయిలకయితే ఇంటర్‌ వరకూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. ఈ ఆఫర్‌ మదర్సాలలో చదివే విద్యార్థులకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది.

2. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ కోసం ప్రయాణించే విద్యార్థులకు ట్రెయిన్‌ టికెట్‌ ధర మీద 75 శాతం డిస్కౌంట్‌ని ప్రకటించింది. అయితే ఇది జనరల్‌​ టికెట్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.

3. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ వంటి పోటి పరీక్షలకు హాజరయ్యేందుకు వెళ్లే విద్యార్థులకు ట్రెయిన్‌ టికెట్‌ ధర మీద 50 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది.

4. ఇళ్లకు దూరంగా ఉంటూ చదువుకునే విద్యార్థుల కోసం, ఎడ్యుకేషనల్‌ టూర్ల కోసం వెళ్లే విద్యార్థులకు కూడా రాయితీలు ప్రకటించింది. వీరికి స్లీపర్‌ క్లాస్‌ టికెట్స్‌ మీద 50 శాతం రాయితీ, ఎమ్‌ఎస్‌టీ లేదా క్యూఎస్‌టీ(మూడు నెలల పాస్‌లాంటిది)ల మీద 50 శాతం డిస్కౌంట్‌ని ప్రకటించింది.

5. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇదే స్లీపర్‌ క్లాస్‌, ఎమ్‌ఎస్‌టీ, క్యూఎస్‌టీల మీద 75 శాతం రాయితీలను ప్రకటించింది.

6. పరిశోధనల నిమిత్తం ప్రయాణించే 35 ఏళ్ల లోపు విద్యార్థులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఏదైనా రిసెర్చ్‌ పని మీద వేర్వేరు ప్రదేశాలకు ప్రయాణించే విద్యార్థులకు ట్రెయిన్‌ టికెట్‌ చార్జీ మీద 50 శాతం డిస్కౌంట్‌ని ఇస్తున్నట్లు తెలిపింది.

7. వర్క్‌ క్యాంప్‌, కల్చరల్‌ కాంపీటిషన్‌ ప్రొగ్రామ్‌లలో పాల్గొనేందకు వెళ్లే విద్యార్థులకు స్లీపర్‌ క్లాస్‌ ట్రెయిన్‌ టికెట్‌ చార్జీల మీద 25 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

8. మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏడాది ఒకసారి తీసుకెళ్లే స్టడీ టూర్‌ల కోసం జనరల్‌ క్లాస్‌ టికెట్‌ చార్జీల మీద 75 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది.

9. భారతదేశంలో చదివే విదేశీ విద్యార్థులకు కూడా రాయితీలు ప్రకటించింది. భారతదేశంలో చదివే ఫారిన్‌ స్టూడెంట్స్‌, భారత ప్రభుత్వం నిర్వహించే ఏదైనా సెమినార్‌లకు హాజరయ్యేందుకు వెళ్లేటప్పుడు స్లీపర్‌ క్లాస్‌ టికెట్ల మీద 50 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. చారిత్రక ప్రదేశాల పర్యటనకు వెళ్లే విదేశీ విద్యార్థులకు కూడా ఇదే ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది.

10. భారతీయ రైల్వే సంస్థ క్యాడెట్‌, మెరైన్‌ ఇంజనీర్‌ అప్రెంటిస్‌కు కూడా డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించింది. నౌకాయాన లేదా ఇంజనీరింగ్‌ శిక్షణ కోసం వెళుతున్న విద్యార్థులకు ట్రెయిన్‌ టికెట్‌ చార్జీల మీద 50శాతం రాయితీ ప్రకటించింది. ఈ డిస్కౌంట్‌ ట్రైనింగ్‌ కార్యక్రమం పూర్తయ్యే వరకూ వర్తిస్తుందని వెల్లడించింది.

అయితే ఈ రాయితీలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి.. విధి విధానాల గురించి పూర్తి సమాచారాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు