ఆయుర్వేదంతో డెంగీకి చెక్‌

18 Apr, 2018 01:06 IST|Sakshi

ఔషధాన్ని తయారుచేసిన భారత శాస్త్రవేత్తలు

ప్రయోగాత్మక దశలో మందు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న డెంగీ వ్యాధికి చెక్‌ పెట్టే ఆయుర్వేద ఔషధాన్ని భారత శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రపంచంలో డెంగీ నివారణ కోసం రూపొందించిన మొట్టమొదటిదిగా చెపుతున్న ఈ ఔషధం వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రానుంది. ఆయుష్, ఐసీఎంఆర్‌ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పని చేసే ద సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌(సీసీఆర్‌ఏఎస్‌) శాస్త్రవేత్తలు ఈ ఔషధాన్ని రూపొందించారు. కర్ణాటకలోని బెల్గామ్‌లో ఉన్న సీసీఆర్‌ఏఎస్‌ ప్రాంతీయ పరిశోధనా కేంద్రంలో ఈ ఔషధం భద్రత, సామర్థ్యంపై ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

డబుల్‌ బ్లైండ్‌ ప్లాస్బో అనే కంట్రోల్డ్‌ క్లినికల్‌ ట్రయల్‌ ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సీసీఆర్‌ఏఎస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ విద్యా కేఎస్‌ ధిమాన్‌ తెలిపారు. మానవులపై పరిశోధనలు చేసే ఈ పద్ధతికి అంతర్జాతీయంగా ఆమోదం ఉందని చెప్పారు. ఆయుర్వేదంలో వినియోగిస్తున్న 7 మూలికలతో   గత ఏడాది జూన్‌లో ఔషధాన్ని సిద్ధం చేశామని చెప్పారు. పైలట్‌ స్టడీలో 90 మంది రోగులకు ద్రవ రూపంలో ఔషధం ఇచ్చామని, ఇకపై నిర్వహించే క్లినికల్‌ ట్రయల్స్‌లో దీనిని ట్యాబ్లెట్‌ రూపంలో ఇస్తామని చెప్పారు.

దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగీ వల్ల తీవ్రమైన జ్వరం, ఒళ్లు నెప్పులు, తీవ్ర తలనొప్పి, వాంతులు, చర్మ సంబంధ సమస్యలు మొదలైనవి వస్తాయి. ఏటా 40 కోట్ల మంది డెంగీ బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ప్రస్తుతం డెంగీకు ఎటువంటి మందు లేదు. డెంగీ లక్షణాల ఆధారంగా ముందస్తు నివారణ చర్యలు మాత్రమే చేపడుతున్నారు. దీంతో ప్రభుత్వాలు.. ఆరోగ్య సంస్థలు దీనికి అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించాయి.  

మరిన్ని వార్తలు