డ్రోన్‌ ముప్పును తప్పించే సాంకేతికత

30 Sep, 2019 03:35 IST|Sakshi

సౌదీలో దాడులు, పంజాబ్‌లో ఆయుధాల చేరవేతతో కేంద్రం అప్రమత్తం

న్యూఢిల్లీ: భారత్‌లో దాదాపు 6 లక్షలకు పైగా అనియంత్రిత డ్రోన్లు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. డ్రోన్ల ద్వారా ఉగ్రవాద చర్యలు, ఇతర సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా స్కై ఫెన్స్, డ్రోన్‌ గన్‌ తదితర ఆధునిక యాంటీ డ్రోన్‌ ఆయుధాల వినియోగాన్ని పలు భద్రతా సంస్థలు పరీక్షిస్తున్నాయని ఆదివారం వెల్లడించాయి. డ్రోన్లు, అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్స్, రిమోట్‌ ద్వారా పనిచేసే చిన్న విమానాలు భద్రత పరంగా సున్నితమైన ప్రాంతాలకు, ఇతర కీలక కార్యాలయాలకు, ప్రజలు భారీగా పాల్గొనే కార్యక్రమాలకు ముప్పుగా పరిణమించే అవకాశంపై సెక్యూరిటీ సంస్థలు ఒక బ్లూప్రింట్‌ను రూపొందించాయి. పీటీఐ వార్తాసంస్థ చేతికి చిక్కిన ఆ నివేదికలో.. ఆ ముప్పును ఎదుర్కొనేందుకు ఒక సమగ్ర ప్రణాళిక అవసరమని ఆయా సంస్థలు నిర్ధారించాయి.

వివిధ సైజులు, వివిధ సామర్థ్యాలున్న ఈ 6 లక్షల డ్రోన్లను ఎవరైనా విధ్వంసానికి వాడే అవకాశముందని హెచ్చరించాయి. సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై ఇటీవల జరిగిన డ్రోను దాడులు, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో నుంచి పంజాబ్‌లోకి డ్రోన్ల ద్వారా ఆయుధాల చేరవేత.. తదితరాలను అందులో ప్రస్తావించాయి. అందువల్ల ఈ ముప్పును ఎదుర్కొనేందుకు, ఆయా డ్రోన్లను ఎదుర్కొని నిర్వీర్యం చేసేందుకు స్కై ఫెన్స్, డ్రోన్‌ గన్, ఎథీనా, డ్రోన్‌ క్యాచర్, స్కైవాల్‌... తదితర సాంకేతికతను ఉపయోగించుకోవడాన్ని భారత సెక్యూరిటీ ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. ఇండియన్‌ పోలీస్‌ జర్నల్‌లో రాజస్తాన్‌ అదనపు డీజీపీ పంకజ్‌ కుమార్‌ రాసిన ‘డ్రోన్స్‌.. అ న్యూ ఫ్రంటియర్‌ ఫర్‌ పోలీస్‌’ అనే వ్యాసంలో ఈ వివరాలున్నాయి.

డ్రోన్‌ గన్‌ ద్వారా డ్రోన్‌కు దాని పైలట్‌ నుంచి అందే మొబైల్‌ సిగ్నల్‌ను అడ్డుకుని, అది ఎలాంటి విధ్వంసం సృష్టించకముందే దాన్ని నేలకూల్చే అవకాశముంది. అలాగే, కీలక స్థావరాలపై డ్రోన్‌లకు అందే సిగ్నల్స్‌ను అడ్డుకునేలా డ్రోన్‌ ఫెన్స్‌లు ఏర్పాటు చేయవచ్చు. హరియాణాలోని బోండ్సిలో ఉన్న బీఎస్‌ఎఫ్‌ క్యాంప్‌లో ఇటీవల తొలిసారి ఈ డ్రోన్‌ వ్యతిరేక సాంకేతికతలను ప్రదర్శించారు. ఈసీఐఎల్, బీఈఎంఎల్‌ సంస్థలు తమ తయారీ యాంటీ డ్రోన్‌ సాంకేతికతలను ప్రదర్శించాయి. ఎయిర్‌ఫోర్స్, సీఐఎస్‌ఎఫ్‌ తదితర సంస్థలు ఇందులో పాల్గొన్నాయి.

>
మరిన్ని వార్తలు