షరీఫ్‌ ఓటమిని భరించలేని భారత గ్రామం

27 Jul, 2018 19:00 IST|Sakshi
షరీఫ్‌ విజయం కోసం ప్రార్థిస్తున్న గ్రామస్థులు

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో నవాజ్‌ షరీఫ్‌ పార్టీ విజయం సాధించాలని భారత ప్రభుత్వం కోరుకుందంటూ కాబోయే పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన ఆరోపణల్లో నిజమెంతుందో తెలియదుగానీ భారత్‌లోని ఓ గ్రామ ప్రజలు మాత్రం మనస్ఫూర్తిగా నవాజ్‌ షరీఫ్‌ పార్టీ విజయాన్ని కోరుకున్నారు. అదే పంజాబ్‌ రాష్ట్రంలోని టార్న్‌ తరణ్‌ జిల్లా, జటి ఉమ్రా గ్రామం. నవాజ్‌ షరీఫ్‌ పూర్వీకులు ఈ గ్రామానికి చెందినవారు. దేశ విభజనకు ముందు షరీఫ్‌లు ఇక్కడి నుంచి పాకిస్తాన్‌కు వెళ్లిపోయారు. గ్రామంలోని షరీఫ్‌ల ఇల్లు గురుద్వార్‌గా మారింది. నవాజ్‌ షరీఫ్‌ తాత మియాన్‌ ముహమ్మద్‌ బక్ష్‌ సమాధి ఇప్పటికీ ఈ గ్రామంలో ఉంది.

నవాజ్‌ షరీఫ్‌ పూర్వీకులతో ఈ గ్రామానికి ప్రత్యక్ష సంబంధం ఉండడంతో భారత్‌ రాజకీయాలతో పాటు పాక్‌ రాజకీయాల గురించి ఇక్కడి ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. ఈ గ్రామం అభివృద్ధిలో షరీఫ్‌ల పాత్ర ఉండడమే అందుకు కారణం కూడా. నవాజ్‌ షరీఫ్‌ తమ్ముడు, పాక్‌ పంజాబ్‌ రాష్ట్రం ముఖ్యమంత్రి షాహ్బాజ్‌ షరీఫ్‌ 2013లో ఈ గ్రామన్ని సందర్శించారు. గ్రామం పరిస్థితిని చూసి ఆయన బాధ పడ్డారు. గ్రామం అభివద్ధికి చర్యలు తీసుకోవాల్సిందిగా మన పంజాబ్‌ రాష్ట్రం అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు పాక్‌ పంజాబ్‌కు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు కూడా ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ సిద్ధమయ్యారు. అది వివాదాస్పదం అవడంతో మానుకున్నారు.

అయితే షాహ్బాజ్‌ విజ్ఞప్తి మేరకు గ్రామంలోని అన్ని రూట్లకు రోడ్డు వేశారు. నవాజ్‌ షరీఫ్‌ తాత సమాధి వద్దకు వెళ్లేందుకు వీలుగా కూడా ఓ ప్రత్యేక రోడ్డు వేశారు. మురుగునీరు పోయేందుకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నైట్‌ షెల్టర్, ఓ మినీ స్టేడియంను కూడా గ్రామంలో నిర్మించారు. షరీఫ్‌ కుటుంబానికి చెందిన గల్ఫ్‌ కంపెనీల్లో ఈ గ్రామానికి చెందిన దాదాపు 25 మంది యువకులకు కూడా ఉద్యోగాలిచ్చారు. మళ్లీ గ్రామం బాగోగుల గురించి ఎవరు పట్టించుకోకపోవడంతో అప్పుడేసిన రోడ్లు పాడయ్యాయి.

డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నది. నవాజ్‌ షరీఫ్‌ సమాధి శిథిలమయింది. ఆ ప్రాంతంలో అంతా గడ్డి మొలచింది. గ్రామం అభివృద్ధికి నిధులను కేటాయించకపోవడమే ఈ దుస్థితికి కారణమని గ్రామ పెద్ద దిల్బాగ్‌ సింగ్‌ సాంధు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో నవాజ్‌ షరీఫ్‌ పార్టీ విజయం సాధిస్తే ఆయన మరోసారి తమ గ్రామాన్ని సందర్శిస్తారని, తద్వారా తమకు మంచి రోజులు రావచ్చని టార్న్‌ తరణ్‌ ప్రజలు ఆశించారు. పాపం వారి ఆశలు అడియాశలయ్యాయి.

>
మరిన్ని వార్తలు