కాబూల్లో కిడ్నాపైన భారత మహిళ క్షేమం

23 Jul, 2016 09:23 IST|Sakshi
కాబూల్లో కిడ్నాపైన భారత మహిళ క్షేమం

కాబూల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లో గత నెలలో కిడ్నాప్ కు గురైన భారత మహిళ కథ సుఖాంతమైంది. ఆమె ఆచూకీ శనివారం దొరికిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కోత్ కతాకు చెందిన జుడిత్ డిసౌజా (49) కాబూల్ లోని ఆగాఖాన్ ఫౌండేషన్ లో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. జూన్ 9 న ఆమెను ఉగ్రవాదులు కిడ్నాప్  చేశారు. జూన్ 15 న ఆమె ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది.

దీనిపై సుష్మా స్వరాజ్ డిసౌజా కుటుంబ సభ్యులకు ఆమెను క్షేమంగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. భారతీయ మహిళ కిడ్నాప్ ఘటనలో చర్యలు వేగవంతం చేయాలని భారత విదేశాంగ శాఖ అఫ్ఘాన్ అధికారులను కోరింది. అక్కడి భారత అధికారులను సుష్మ  అప్రమత్తం చేశారు. అనంతరం ఎట్టకేలకు జూడిత్ ఆచూకీని భారత్-అఫ్ఘాన్ అధికారులు కనుగొని ఆమెను రక్షించారు. ప్రస్తుతం భారత ఎంబసీ సంరక్షణలో ఉన్న జుడిత్.. త్వరలోనే మాతృదేశానికి తిరిగొస్తారని సుష్మ తన ట్వీట్లలో చెప్పారు. ఆమె ఆచూకీని కనుగొనడంలో చురుగ్గా వ్యవహరించిన భారత ఎంబసీ అధికారి మన్ప్రీత్ ఓహ్రాను ఆమె అభినందించారు. చాలా అద్భుతంగా పనిచేశారంటూ ప్రశంసించారు. తన సోదరి క్షేమ సమాచారం తెలిసిన వెంటనే ఆమె  సోదరుడు జెరోమ్ డిసౌజా సుష్మాకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

 

మరిన్ని వార్తలు