సౌదీలో భారత్ వర్కర్ కష్టాలు...!

22 Mar, 2016 12:31 IST|Sakshi
సౌదీలో భారత్ వర్కర్ కష్టాలు...!

ఉపాధి కోసం సౌదీకి వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కొందరు, కుటుంబ భారాన్ని మోసేందుకు మరికొందరు సుదూర తీరాల నుంచి దుబాయ్ కి వలసలు వెళ్తుంటారు.  వీరిలో కొందరు కొన్నాళ్ల తర్వాత స్వదేశానికి వచ్చి స్థిరపడుతున్నా... ఎక్కువశాతం మంది అక్కడ యజమానులు పెట్టే హింసలకు, ఇబ్బందులకు గురై తీవ్ర కష్టాల్లో కూరుకుపోతున్నారు. ప్రస్తుతం  ఫేస్‌బుక్‌లో కలకలం సృష్టించిన వీడియో ఈ కష్టాలు, కన్నీళ్లను కంటికి కట్టినట్లు చూపిస్తోంది. భారత్ నుంచి  సౌదీ అరేబియాకు డ్రైవర్ పనికోసం వెళ్లి యజమాని పెట్టే హింసలను భరించలేక కన్నీటి పర్యంతమౌతున్న అబ్దుల్ సత్తార్ మకందర్ వీడియో సౌదీ కష్టాలను కళ్లకు కట్టింది.

రెండేళ్ల క్రితం ఉపాధి కోసం వెళ్లి సౌదీ అరేబియాలో డ్రైవర్‌గా చేరిన 35 ఏళ్ల సత్తార్ మకందర్ అత్యంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. సత్తార్ కన్నీటి కథ వీడియో ను ఢిల్లీకి చెందిన కార్యకర్త కుందన్ శ్రీవాస్తవ గతవారం ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఇంటర్నెట్‌లో ఆ వీడియో దేశ విదేశాల్లోనూ వైరల్‌గా వ్యాపించింది. తన యజమాని స్వదేశానికి (ఇండియాకు) పంపించడం లేదంటూ వీడియోలో సత్తార్ కన్నీరు మున్నీరయ్యాడు. తనకు జీతం కూడా సరిగా చెల్లించడం లేదని, కనీసం తిండికి కూడా డబ్బు ఇవ్వడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే సత్తార్ వీడియో అతడికి మేలు చేయకపోగా, మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. సౌదీలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సత్తార్ వీడియో ఇంటర్నెట్‌లో వ్యాపించడంతో  సౌదీ అధికారులు అతడిని అరెస్టుచేశారు. తప్పుడు సమాచారం వ్యాపింపజేయడం సౌదీ అరేబియాలో క్రిమినల్ చర్యగా భావించిన అధికారులు అతడ్ని అరెస్ట్ చేశారు. దీంతో వెంటనే సౌదీ అధికారులను సంప్రదించి వెంటనే అసలు వీడియోను ఇంటర్నెట్ నుంచి తొలగించి, క్షమాపణలు చెప్పానని శ్రీవాస్తవ తెలియజేశాడు. మానవ హక్కుల కార్యకర్త అయిన శ్రీవాస్తవ మానవత్వమే తన కుటుంబమని, మానవులంతా తమకుటుంబంలోని వారిగానే భావిస్తానని, అందుకే సత్తార్ ను సైతం తన కుటుంబంలోని వ్యక్తిగా భావించి అతడి తరపున క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించాడు.

ఈ సందర్భంలో సత్తార్ మకందర్ ఎ1 సరూర్ యునైటెడ్ గ్రూప్ లో పని చేస్తున్నాడని, అతడికి కంపెనీ సమయానికి జీతం చెల్లిస్తోందని, అతడికి పనిచేయడం ఇష్టం లేకపోతే  స్వేచ్ఛగా వైదొలగవచ్చునని రిక్రూట్ మెంట్ ఏజెన్సీకి చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. అయితే తాను చెప్పిన క్షమాపణలతో సత్తార్ ను విడిచి పెట్టారని, కానీ మర్నాడు వెంటనే మరో కారణంతో అరెస్టు చేశారని శ్రీవాస్తవ చెప్తున్నాడు. మకందర్ తల్లి కూడా అతడితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. అరెస్టు కాకముందు ఐదురోజుల క్రితం సత్తార్ ఓసారి తనతో మాట్లాడాడని, ఆ తర్వాత సత్తార్ ను అరెస్టు చేసినట్లు స్నేహితులు చెప్పారని ఆమె తెలిపింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించలేదని శ్రీవాస్తవ అన్నాడు. ఇప్పటికీ మకందర్  ఖైదీగానే ఉన్నాడని, ఏ ప్రభుత్వం అతడికి సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

>
మరిన్ని వార్తలు