రానున్న ఎన్నికల్లో మీడియా ప్రభావం

14 Jan, 2019 18:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక కాలంలో మీడియా ప్రభావం అనూహ్యంగా పెరుగుతోంది. ముఖ్యంగా వార్తల కోసం మీడియాపై ఆధారపడుతున్న వారి సంఖ్య గడచిన నాలుగేళ్ల కాలంలో బాగా పెరిగింది. రేడియో వార్తల శ్రోతలు తగ్గుతుండగా, ఇంటర్నెట్‌లో వార్తలు చూసే వారి సంఖ్య పెరగకుండా, తగ్గకుండా ఓ మోస్తారులోనే ఉంది. ఇక వార్తల కోసం పత్రికలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగి ఓ స్థాయిలో నిలిచిపోయింది. టీవీ ఛానళ్లలో వార్తలు చూసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక వార్తల్లో ఎక్కువగా బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర స్థానంలో ఉండగా, కాంగ్రెస్‌ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. వ్యక్తిగతంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న వారిలో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో, అరవింద్‌ కేజ్రివాల్‌ రెండోస్థానంలో, రాహుల్‌ గాంధీ మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

ఎన్నికల సమయాల్లో మీడియా ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశంపై ‘లోక్‌నీతి– సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌’ (1994 నుంచి 2014 మధ్యకాలంపై) నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వార్తల కోసం 46 శాతం మంది టీవీ ఛానళ్లను వీక్షిస్తుండగా, 26 శాతం మంది వార్తా పత్రికలపై ఆధారపడుతున్నారు. దాదాపు ఐదు శాతం మంది మాత్రమే వార్తల కోసం ఇంటర్నెట్‌పై ఆధారపడ్డారు. ఇంటర్నెట్‌లో వార్తలు చూసే వారి సంఖ్య 2017లో 16 శాతం మంది ఉన్నట్లు ‘ప్యూ గ్లోబల్‌ ఆటిట్యూడ్‌’ నిర్వహించిన సర్వేలో తేలింది. ఉన్నత విద్యావంతులు, పట్టణ ప్రాంతాల్లోనే వార్తల కోసం ఇంటర్నెట్, సోషల్‌ మీడియాను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా మహిళలకన్నా పురుషులే ఈ రెండు మీడియాలను ఎక్కువగా చూస్తున్నారు.

మీడియాలో ఎక్కువగా బీజేపీనే ప్రాచుర్యం పొందగా, ఎక్కువగా ఉపయోగించుకుంటున్నది కూడా బీజేపీనే. మీడియాలో బీజేపీ ప్రాచుర్యం 39 శాతం ఉండగా, కాంగ్రెస్‌ ప్రాచుర్యం 27 శాతం ఉంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతానికి నరేంద్ర మోదీ ప్రభావం, ప్రాచుర్యం బాగా తగ్గింది. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి, ఆయన పార్టీకే ఓటేస్తామని టీవీల్లో హిందీ వార్తలు చూసే ప్రజలు తెలియజేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో వార్తలు చూసేవారు కచ్చితంగా ఈసారి కాంగ్రెస్‌కు ఓటేస్తామని చెబుతున్నారు. బీజేపీతో పోలిస్తే మీడియాలో కాంగ్రెస్‌ పార్టీకి తక్కువ ప్రాచుర్యం ఉన్నా ఓటింగ్‌ శాతం మాత్రం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు