భారత్‌కు షాక్‌.. ఇండియన్స్‌ నో హ్యాపీ

15 Mar, 2018 09:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌కు ఇదో షాకింగ్‌ విషయం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకున్నా.. ఉగ్రవాద సమస్యలు లేకున్నా.. నిత్యం అభివృద్ధితో దూసుకెళుతున్నా, ప్రజలంతా శాంతియుత వాతావరణంలో బతికేస్తున్నా సర్వేలు నిర్వహించినప్పుడు మాత్రం ఎవరూ ఊహించని ఫలితాలు వెలుగుచూస్తున్నాయి. భారతీయులు సంతోషంగా లేరట.. అదే సమయంలో పాకిస్థాన్‌ పౌరులు మాత్రం చాలా హాయిగా గడిపేస్తున్నారంట. తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ప్రపంచ సంతోషకరమైన దేశాల జాబితాలో ఈ షాకింగ్‌ విషయం తెలిసింది. 2017 నివేదిక సమయానికి భారత్‌ 4 స్థానాలకు పడిపోగా తాజాగా విడుదల చేసిన 2018 నివేదికలో ఏకంగా 11 స్థానాల కిందికి పడిపోయింది.

మొత్తం 156 దేశాల జాబితాను ఐక్యరాజ్యసమితి విడుదల చేయగా 133ర్యాంకుతో భారత్‌ సరిపెట్టుకుంది. ప్రతి ఏడాది ఐరాసకు చెందిన ఎస్‌డీఎస్‌ఎన్‌ (సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్‌) ఈ రిపోర్టు తయారు చేస్తుంది. భారత్‌ ర్యాంకుతో నిత్యం ఉగ్రవాదం సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ను పోలిస్తే.. అక్కడి ప్రజలు ఆనందంగా, హాయిగా గడిపేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. 2017లో ర్యాంకులు ప్రకటించినప్పుడే భారత్‌కంటే మెరుగైన ర్యాంకును సాధించిన పాక్‌ మరోసారి 2018 నివేదికలో కూడా అదే పైచేయి సాధించింది. అంతేకాదు గత ఏడాదికంటే మరో 5 ర్యాంకులు పైకి ఎగబాకింది. ప్రస్తుతం పాక్‌ 75 ర్యాంకుతో భారత్‌కంటే చాలా ముందున్నట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అంతేకాదు, భారత్‌కంటే చిన్న చిన్న దేశాలైన బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌, శ్రీలంకవంటి దేశాలు కూడా హ్యాపియెస్ట్‌ కంట్రీల జాబితాలో భారత్‌కంటే ముందున్నాయి. ఇక చైనా కూడా భారత్‌కంటే ఎంతో ముందుంది. ఇక ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన జాబితాలో తొలిస్థాన్‌ ఫిన్‌లాండ్‌ దక్కించుకుంది. నార్వే, డెన్మార్క్‌ రెండు, మూడుస్థానాల్లో ఉన్నాయి.

పది సంతోషకరమైన దేశాలు
1. ఫిన్లాండ్‌
2. నార్వే
3. డెన్మార్క్‌
4. ఐస్‌లాండ్‌
5. స్విట్జర్లాండ్‌
6. నెదర్లాండ్‌
7. కెనడా
8. న్యూజిలాండ్‌
9. స్వీడన్‌
10. ఆస్ట్రేలియా

10 అసంతృప్తికరమైన దేశాలు
1. మలావి
2. హైతీ
3. లిబేరియా
4. సిరియా
5. రువాండా
6. యెమెన్‌
7. టాంజానియా
8. దక్షిణ సుడాన్‌
9. సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌
10. బురుండి

>
మరిన్ని వార్తలు