ఎక్కే విమానం.. దిగే విమానం

16 Sep, 2018 07:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విదేశీ ప్రయాణం అంటే భారతీయులకు తగని మోజులా ఉంది. ఎక్కే విమానం దిగే విమానంగా తెగ తిరిగేస్తున్నారు. గత అయిదేళ్లలోనే భారతీయులు విదేశీ ప్రయాణాలకు పెడుతున్న ఖర్చు భారీగా పెరిగింది. ఏకంగా 253 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఇతర దేశాల్లో పర్యాటక ప్రాంతాలను చూడాలన్న ఆసక్తి, అత్యున్నత చదువులకోసం విదేశాలకు వెళ్లడం గత కొంత కాలంగా బాగా పెరిగిపోయింది. దీంతో విదేశీయానాలు పెరిగిపోయాయని కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. 2014 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు విదేశీ ప్రయాణాల కోసం 112 కోట్లు ఖర్చు పెడితే, 2018 సంవత్సరం వచ్చేసరికి ఆ ఖర్చు  28 వేల కోట్లకు పెరిగిపోయింది.

ఇది ఏకంగా 253 రెట్లు ఎక్కువ. ఇక విదేశాల్లో చదువుల విషయానికి వచ్చేసరికి 2014లో 3వేల కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఏడాది వచ్చేసరికి ఆ ఖర్చు 14 వేల కోట్లకు పెరిగింది. 2017లో భారత్‌ నుంచి వివిధ దేశాలకు 2.3 కోట్ల మంది ప్రయాణికులు తరలివెళ్లారు. విదేశీ ప్రయాణాలకు భారతీయులు పెడుతున్న ఖర్చు ఏ స్థాయిలో జరుగుతోందని అంటే, భారత దేశ వాణిజ్య లోటుపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. చమురు, ఎలక్ట్రానిక్‌ పరికరాల దిగుమతులపై పడుతున్న వాణిజ్య లోటుతో, ఈ విదేశీ ప్రయాణాల కారణంగా పడుతున్న ప్రభావం ఇంచుమించు సరిసమానంగా ఉంటోంది.

ఎందుకీ ప్రయాణాలు ?

లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) అమల్లోకి వచ్చిన తర్వాత భారతీయులు విదేశాలకు రెక్కలు కట్టుకొని వెళ్లిపోతున్నారు. ఈ పథకం ద్వారా ప్రతీ పౌరుడు 2013–14లో వంద కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేయవచ్చునన్న పరిమితులు ఉండేవి. దానిని ఇప్పుడు ఏకంగా 2,50,00 డాలర్లకు పెంచేశారు. అంతేకాకుండా విదేశాల్లో క్రెడిట్‌ కార్డు సౌకర్యాన్ని వాడుకునే సదుపాయం కూడా ఉంది. ఇవన్నీ కూడా విదేశీ ప్రయాణాలు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి. ‘2017 వరకు రూపాయి విలువలో పెద్దగా హెచ్చుతగ్గుల్లేవు.

అంతేకాకుండా బ్యాంకుల్లో ఫైనాన్స్‌ కూడా సులభమైపోయింది. ప్రయాణాల కోసం ప్రత్యేకంగా లోన్‌ సౌకర్యం లేకపోయినప్పటికీ పర్సనల్‌ లోన్స్‌ పెట్టుకొని మరీ విదేశాలు చుట్టేసి వస్తున్నారు‘ అని ముంబైకి చెందిన ఒక బ్యాంకు అధికారి వెల్లడించారు. అయితే విదేశాల్లో పెట్టుబడులు, ఆస్తులు సమకూర్చుకోవడం వంటివి మాత్రం తగ్గిపోతున్నాయి. ఎందుకంటే విదేశాల్లో భారతీయులు మనీ ఇన్వెస్ట్‌ చేయడం, విదేశాల్లో జరిగే లావాదేవీలపై ఆర్‌బీఐ ఒక కన్నేసి ఉంచుతోంది. దీంతో విదేశాలకు వెళ్లి చూసి వచ్చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
 

మరిన్ని వార్తలు