మాకో హిట్లర్‌ కావాలి

18 Oct, 2017 05:29 IST|Sakshi

నియంతృత్వమే మేలంటున్న మెజారిటీ

శక్తిమంతమైన నాయకుడిని కోరుకుంటున్న యువత

ప్యూ రీసెర్చ్‌ తాజా సర్వేలో వెల్లడి

సైనికపాలనకు ఓటేసిన వారు 53%

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అస్థిర ప్రభుత్వాలు రాజ్యమేలినా.. ఏనాడూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాన్ని సైన్యం చేయలేదు. ప్రజాతీర్పే శిరోధార్యం.. మరి ఇలాంటి దేశంలో ప్రస్తుతం ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. కారణమేదైనా కావొచ్చు.. భారతీయుల్లో అత్యధికులు(55 శాతం మంది) నియంతృత్వ పాలనను కోరుకుంటున్నారని ప్యూ రీసెర్చ్‌ సర్వేలో తేలింది. ప్రపంచంలోని 38 ముఖ్య దేశాల్లో పాలన తీరు, ప్రభుత్వాలపై ప్రజల విశ్వాసం.. అనే అంశాలపై ప్యూ రీసెర్చ్‌ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16–మే 8 మధ్యలో 38 దేశాల్లో 41,953 మంది అభిప్రాయాలను ప్యూ రీసెర్స్‌ సేకరించింది. దీని ప్రకారం.. సమష్టి నిర్ణయాల కంటే ఏకవ్యక్తి పాలనే మెరుగని భారతీయులు విశ్వసిస్తున్నారు.

ఏడు దశాబ్దాల ఘనచరిత్ర కలిగిన ప్రజాస్వామ్యమని (ఎమర్జెన్సీ చీకటి రోజులను మినహాయిస్తే) చెప్పుకునే మనదేశంలో 55 శాతం మంది ఏదో ఒకరూపంలో నియంతృత్వాన్నే కోరుకుంటున్నారు. 27 శాతం మంది పటిష్ట నాయకత్వాన్ని కోరుకోగా, 53 శాతం మంది సైనిక పాలనే మేలంటున్నారు. అయితే 50 ఏళ్లకు పైబడిన వాళ్లలో మాత్రం అత్యధికులు సైనికపాలనకు తాము వ్యతిరేకమంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై తమకు విశ్వాసముందని సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో ఏకంగా 85 శాతం మంది చెప్పడం విశేషం. 2012 నుంచి భారత్‌ సగటున 6.9 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ఇది ముఖ్యకారణమని ప్యూ విశ్లేషించింది.

శక్తిమంతమైన నాయకుడు కావాలి..
శక్తిమంతమైన నాయకుడి రూపంలో ఏకవ్యక్తి పాలన మేలని 27 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. బలమైన నాయకుడి పాలనను 48 శాతం మంది రష్యన్లు కోరుకుంటున్నారు. అయితే ఏకవ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతమైన పాలన సాధారణంగా జనాదరణకు నోచుకోదని ప్యూ రీసెర్స్‌ వ్యాఖ్యానించింది. పార్లమెంటు, న్యాయస్థానాల జోక్యం లేకుండా.. శక్తిమంతమైన నాయకుడు నిర్ణయాలు తీసుకునే పాలనా విధానం మెరుగ్గా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా 26 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఫలితాలు త్వరగా కనపడతాయని భావిస్తున్నారు. అయితే ఇలాంటి పాలన మంచిది కాదని 71 శాతం మంది పేర్కొన్నారు.

జర్మనీలో 93 శాతం, స్వీడన్‌లో 90 శాతం, నెదర్లాండ్స్‌లో 89 శాతం మంది బలమైన ఏకవ్యక్తి నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో టెక్నోక్రసీ(సాంకేతిక నిపుణులతో కూడిన బృందం) పాలనను బలపర్చిన మూడు దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. వియత్నాంలో 67 శాతం, భారత్‌లో 65 శాతం, ఫిలిప్పీన్స్‌లో 62 శాతం మంది నిపుణుల ఆధ్వర్యంలో పాలన సాగాలని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే రాజకీయ నాయకత్వం చేతిలోనే పాలన ఉండాలని 57 శాతం మంది ఆస్ట్రేలియన్లు పేర్కొన్నారు.

సైనిక పాలనకు ‘జై’
ఆదర్శ ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా నిలుస్తున్నామని చెప్పుకొనే భారత్‌లో ఏకంగా 53 మంది సైనికపాలనను కోరుకోవడం విశేషం. రాజకీయ నాయకత్వంపై నమ్మకాన్ని కోల్పోవడం, అవినీతి పెచ్చరిల్లడం, ఇతర అవలక్షణాలు దీనికి కారణం కావొచ్చు. సైనికపాలనను కోరుకుంటున్న వారిలో మెజారిటీ 50 ఏళ్లలోపు వారే కావడం ఇక్కడ గమనార్హం. ఇది యువతలో ప్రస్తుత వ్యవస్థపై గూడుకట్టుకున్న అసహనాన్ని సూచిస్తోంది. దక్షిణాఫ్రికాలోనూ 52 శాతం మంది సైనికపాలనే మేలని భావిస్తున్నారు. అయితే యూరోప్‌లో మాత్రం కేవలం పది శాతం మందే సైనిక పాలనకు ఓటేశారు. సర్వే నిర్వహించిన 38 దేశాల్లో సగం కంటే ఎక్కువ దేశాల్లో ప్రాతినిథ్య ప్రజాస్వామ్యమే మేలని జనం అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య అనుకూల వైఖరి ఉన్నా దేశాలను బట్టి ఇది మారింది. ప్రజాస్వామ్యాన్ని కాంక్షిస్తూనే.. ఇతర పాలన విధానాలకు కూడా తాము వ్యతిరేకం కాదనే భావనను ఆయా దేశాల ప్రజలు వ్యక్తపరిచారు.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు