ఇండోర్‌.. ఎందుకు బేజార్‌?

21 Apr, 2020 12:06 IST|Sakshi

స్వచ్ఛతలో హ్యాట్రిక్‌ సాధించినా ఫలితం శూన్యం!

ప్రస్తుతం ఆ నగరం కరోనా వైరస్‌తో కకావికలం  

గతంలో అక్కడి విధానాలను అధ్యయం చేసిన జీహెచ్‌ఎంసీ  

దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టిన కార్పొరేషన్‌  

ర్యాంకింగ్‌లో ఘనతలున్నా.. లాక్‌డౌన్‌ ఉల్లంఘనలా?

ఇండోర్‌ నేర్పుతున్న పాఠాలపై యంత్రాంగం అప్రమత్తం     

మన సిటీలో స్వచ్ఛతపై శ్రద్ధ చూపాలంటున్న ప్రజలు

సాక్షి, సిటీబ్యూరో: ఇండోర్‌.. దేశంలోనే స్వచ్ఛతలో ఈ నగరానిది ప్రథమ స్థానం. వరుసగా మూడుసార్లు (2017, 2018, 2019) నంబర్‌ వన్‌ నగరంగా నిలిచింది. అక్కడ అమలు చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలను, స్వచ్ఛత కోసం పాటిస్తున్న నిబంధనలను తెలుసుకునేందుకు వివిధ నగరాలు అప్పట్లో క్యూ కట్టాయి. అదే దారిలో జీహెచ్‌ఎంసీ నుంచి సైతం పలువురు అధికారులు, పలు పర్యాయాలు ఇండోర్‌ను గతంలో చుట్టి వచ్చారు. వీరిలో ఐఏఎస్‌లు, అడిషనల్, జోనల్‌ కమిషనర్లు, చీఫ్‌ సిటీప్లానర్‌ సహా ఎందరో ఉన్నారు. ఇండోర్‌లో అమలవుతున్న కార్యక్రమాల అధ్యయన యాత్రలకు జీహెచ్‌ఎంసీ అప్పట్లో దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేసిందంటే అతిశయోక్తి కాదు. స్వచ్ఛతలో మేటిగా ఉన్న ఆ నగరంలో వ్యాధులుఉండవని, ప్రస్తుతం కరోనా కూడా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉండవచ్చని ఎవరైనా భావిస్తారు. కానీ.. అంతటి మహత్తర నగరం ప్రస్తుతం కరోనా కోరల్లో విలవిల్లాడుతోంది.  

ఎందుకీ పరిస్థితి..?
ఇండోర్‌ నగరంలో సుమారు 900 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఎందుకు?. ప్రస్తుతం  ఎందరినో తొలుస్తున్న ప్రశ్న ఇది. స్వచ్ఛ కార్యక్రమాల అమలులో గొప్ప గొప్ప నగరాలనే తలదన్నిన ఇండోర్‌ యంత్రాంగం కరోనాను ఎందుకు కట్టడి చేయలేక పోయిందన్నది అంతు పట్టడం లేదు. కరోనాతో అక్కడ దాదాపు యాభై మంది మరణించారు. మార్చి 25న నాలుగు పాజిటివ్‌ కేసులు మాత్రమే ఉన్న ఇండోర్‌ నగరంలో ప్రస్తుతం 200 రెట్లకు మించి పోయాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్,కంటైన్మెంట్‌ నిబంధనలు, సామాజిక దూరం పాటించకపోవడమే కారణం కావచ్చనిజీహెచ్‌ఎంసీలో చర్చ నడుస్తోంది. 

ఇండోర్‌లో ఇలా..
స్వచ్ఛతకు సంబంధించి ఇండోర్‌ విధానాలను జీహెచ్‌ఎంసీలో అమలు చేసేందుకు అక్కడికి వెళ్లి వచ్చిన అధికారులు గుర్తించిన అంశాలు ఇలా ఉన్నాయి..
ఇండోర్‌ నగర జనాభా దాదాపు 35 లక్షలు
అక్కడ రోడ్డుపై చెత్త వేస్తే రూ. 500– 1000 జరిమానా
రోడ్లపై ప్రతి 100 మీటర్లకు రెండు చెత్త డబ్బాల ఏర్పాటు
చెత్త పరిమాణాన్ని బట్టి తరలింపు చార్జీలు రూ.500 నుంచి రూ.30,000 వరకు  
చెత్త తరలింపు వాహనాల్లో తడి పొడితో పాటు న్యాప్‌కిన్లకు ప్రత్యేక చాంబర్‌
ఏదైనా ఫంక్షన్‌ జరిగితే విందు నిర్వహించినా,  ఆహార వ్యర్థాల తరలింపునకు చార్జీలు చెల్లించాలి. హాజరయ్యే వారి సంఖ్యను బట్టి మనిషికి రూ.50 వంతున వసూలు చేస్తారు. 

ఆదర్శంగా తీసుకుని..
ఇండోర్‌ జనాభా హైదరాబాద్‌లో దాదాపు మూడో వంతే అయినప్పటికీ.. స్వచ్ఛత  అమలుకు ఆ నగరాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో ఉత్తమస్థానం సాధించేందుకు  ఆ విధానాలను అమలు చేసేందుకు అక్కడి నుంచి కన్సల్టెంట్‌లను సైతం రప్పించారు.  
జీహెచ్‌ఎంసీ స్వతహాగానూ ఏటికేడు ఎన్నో వినూత్య కార్యక్రమాలను ప్రవేశపెట్టింది.  
నగర పౌరులు, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలను భాగస్వాముల్ని చేసింది. ప్రస్తుతం దేశంతో పాటు మొత్తం ప్రపంచానికే  మార్గదర్శకంగా నిలిచిన స్వచ్ఛ నమస్కారాన్ని కూడా ఈ నగరమే ఆరంభించింది. మొదట్నుంచీ ఇక్కడ అమలవుతున్న కంటెయిన్‌మెంట్‌ నిబంధనలు, లాక్‌డౌన్, సామాజిక దూరం వంటి వాటితోనే ఇండోర్‌ లాంటి పరిస్థితులు రాలేదని అభిప్రాయపడుతున్న వారూ ఉన్నారు.
జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 24వేల మంది కార్మికులు నగరప్రజల ఆరోగ్య భద్రతకు వీర సైనికుల్లా పనిచేస్తున్నారని చెబుతున్నారు. అయినప్పటికీ.. ఇంకా మరింత అప్రమత్తంగా ఉండాలని.. మరింత పరిశుభ్రంగా,  అన్ని ప్రాంతాలను మరింత స్వచ్ఛంగా ఉంచాలని కోరుతున్నారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో విఫలమైన ఇండోర్‌ పాఠంతో  నగర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అన్ని విధాలా ప్రభుత్వానికి సహకరించాలని జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి చేస్తోంది.

మరిన్ని వార్తలు