భారత్‌కు ఇక రోడ్డు రేలర్‌ రైళ్లు

29 Mar, 2018 19:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో సరకు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకరావడంలో భాగంగా దేశంలో తొలిసారిగా రోడ్డు రేలర్‌ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. కేంద్ర రోడ్డు సరకు రవాణా, జాతీయ రహదారులు, రైల్వే శాఖల సమన్వయంతో ఈ పథకం కార్యరూపం దాలుస్తోంది. చట్టంలో సవరణలు తీసుకురావడంతోపాటు అన్ని అనుమతులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం దేశంలో గూడ్సు రైళ్ల ద్వారా సరకు రవాణా ఎక్కువగా జరుగుతోంది. రైళ్లలో తీసుకొచ్చిన సరకును దించి మళ్లీ  రోడ్డు మార్గాన నిర్దేశిత ప్రాంతానికి తీసుకెళ్లాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన విషయం. ఈ రోడ్డు రేలర్‌ రైళ్ల వల్ల రైలు ఇంజన్ల ద్వారా తీసుకొచ్చిన సరకుల బోగిని రోడ్డు మార్గాన ట్రక్కు ఇంజన్‌కు తగిలించి తీసుకెళ్లవచ్చు. అంటే, రైలింజన్‌తో సరకు తీసుకొని వెళ్లే కార్గో బోగీ రోడ్డుపైకి వచ్చేసరికల్లా కార్గో వ్యాగన్‌ అవుతుంది. అందుకు వీలుగా ఈ రోడ్డు రేలర్‌కు ఎనిమిది టైర్లు, నాలుగు రైలు చక్రాలు ఉంటాయి. పట్టాలపై వెళుతున్నప్పుడు చక్రాలు, రోడ్డుపై వెళుతున్నప్పుడు టైర్లు పని చేస్తాయి.

ఉభయ పద్ధతుల్లో సరకును తరలించవచ్చు కనుక వ్యాపారులు కోరుకునే నిర్దేశిత ప్రాంతానికే కచ్చితంగా తరలించవచ్చని, దీని వల్ల ఎంతో డబ్బు ఆదా అవుతుందని అధికారులు అంటున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు, రిటేల్‌ సరకులు, ఫర్నీచర్, హార్డ్‌వేర్‌ ఉత్పత్తులను ఈ రోడ్డు రేలర్లలో సులభంగా తరలించవచ్చు. జోలార్‌పేట–అరక్కోణం మధ్య ప్రయోగాత్మకంగా ఈ రైలును విజయవంతంగా నడిపి చూశారు. 

మరిన్ని వార్తలు