‘నాకొక గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలి’

14 Apr, 2016 14:21 IST|Sakshi
‘నాకొక గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలి’

ముంబై: ఒడ్డూ పొడువు, ముక్కూ మూతి చక్కంగా ఉన్న టీనేజ్‌ కుర్రాళ్లకే గర్ల్‌ ఫ్రెండ్‌ దొరకడం కష్టం. అటువంటిది ఆరడుగుల ఏడు అంగుళాల పొడవున్న బక్క పలచటి 14 ఏళ్ల యశ్వంత్‌ రౌత్‌కు గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలంటే మాటలా! పైగా ఈ కుర్రాడు కచ్చితంగా ఎనిమిది అడుగుల వరకు పొడుగు పెరుగుతాడని డాక్టర్లు చెబుతున్నారు.

మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన స్కూల్‌ బాయ్‌ యశ్వంత్‌కు తన పెళ్లికి సరిజోడు దొరకదని ఇప్పటి నుంచే బెంగ పట్టుకున్నది. తాను ఎనిమిది అడుగుల వరకు పెరిగితే పెళ్లికి సరిజోడు దొరక్క పోవచ్చని, బహూశ ఆ వయస్సులో పెళ్లి కూడా జరక్క పోవచ్చని బాధ పడుతున్నాడు. కనీసం ఈ ఎత్తుకు ఈ వయస్సులోనైనా గర్ల్‌ ఫ్రెండ్‌ దొరికితే బాగుండునని, తనలో కాన్ఫిడెన్స్‌ పెరుగుతున్నదని తనను కలసిని ఓ మీడియాతో వాపోయాడు.

‘నా కాళ్లకు సరిపడ 15 నెంబర్‌ బూట్లే కష్టంగా దొరికాయి. నాకు టైలర్‌ ప్యాంట్‌ కుట్టాలన్నా ఇబ్బంది పడతారు. ఇక నిత్య జీవితంలో నేను పడే ఇబ్బందులు అంతా ఇంతా కావు. స్కూల్‌ డెస్క్‌లో సరిగ్గా కూర్చోలేను. తరగతి గదిలోకి వెళ్లాలన్నా, ఇంట్లో గుమ్మాలు దాటాలన్నా వంగి, వంగి ఇబ్బంది పడాల్సిందే. మంచం మీద పడుకుంటే చేతులు, కాళ్లు బయటే. బస్సెక్కాలంటే టాప్‌ లేచిపోద్ది.  కారులో సరిగ్గా కూర్చోలేను. నలుగురిలోకి వెళితే అందరూ నావైపే చూస్తారు. కొందరు లంబూ అంటారు.

కొందరు అమితాబ్‌ బచ్చన్‌ అంటారు. అప్పుడప్పుడు నన్ను వీధిలో నిలబెట్టి ఫొటోలు తీసుకుంటుంటే మాత్రం సెలబ్రిటి అయిపోయాననిపిస్తుంది. పొడుగు పెరగాలని అనుకున్నాను. కానీ మరింతలా కాదు. నా పొడువు బాస్కెట్‌ బాల్‌ ఆటకు సరిపోతుంది కనుక బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడిని కావాలని, ఏదో రోజు భారత్‌ తరఫున ఆడాలని కోరుకుంటున్నాను’ అని యశ్వంత్‌ తన గురించి తాను చెప్పుకొచ్చాడు.

యశ్వంత్‌ తండ్రి బ్రహ్మదేవ్‌ రౌత్‌ ఎత్తు ఐదు అడుగుల ఐదు అంగుళాలే. తల్లి సుమన్‌ రౌత్‌ నాలుగు అడుగుల ఐదు అంగుళాలే. వారికి పుట్టిన యశ్వంత్‌ ఇంత పొడువు అవుతారని వారు కలలో కూడా అనుకోలేదు. బిడ్డ కడుపులో ఉండగా, ఏం తిన్నావంటూ ఇరుగు పొరుగు వారు అప్పుడప్పుడు తనను అడుగుతుంటారని సుమన్‌ తెలిపారు. ఏం తిన్నానో తనకే గుర్తు లేదని, ఇక తానేమి చెబుతానని అన్నారు. ప్రస్తుతం సామాజికంగా తన కొడుకుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పారు. గిన్నీస్‌ బుక్‌ రికార్డుల్లోకి ఎక్కాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. అందుకు ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా 18 ఏళ్లు వచ్చే వరకు ఆగాలని వారు సూచించారని తెలిపారు.

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన కెవిన్‌ బ్రాడ్‌ఫోర్డ్‌ 18 ఏళ్ల లోపు కేటగిరీలో గిన్నీస్‌ రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన పొడవు ఏడు అడుగుల ఒక అంగుళం ఉన్నారు. ఆయన పొడవును క్రాస్‌ చేశాక యశ్వంత్‌ను పరిగణలోకి తీసుకుంటారు. ఇక భారత్‌లో అత్యంత పొడవైన వ్యక్తి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 32 ఏళ్ల ధర్మేంద్ర సింగ్‌. ఆయన పొడవు ఎనిమిది అడుగుల ఒక అంగుళం.

మరిన్ని వార్తలు