బంతి సుప్రీంకోర్టులో..

12 Jul, 2018 02:11 IST|Sakshi
జెండాలతో స్వలింగ సంపర్కుల ర్యాలీ (ఫైల్‌)

స్వలింగ సంపర్కం చట్టబద్ధతను తేల్చాల్సింది సుప్రీంకోర్టే

అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్రం

సెక్షన్‌ 377కే విచారణను పరిమితం చేయాలని వినతి

సానుకూలంగా స్పందించిన రాజ్యాంగ ధర్మాసనం

న్యూఢిల్లీ: వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న నిబంధన రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టే తేల్చాలని కేంద్రం పేర్కొంది.  ఐపీసీ సెక్షన్‌ 377లోని ఈ ఒక్క అంశంపైనే రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలు, దత్తతలు, హక్కులు తదితరాల జోలికిపోవొద్దని కోరింది. ఇందుకు సంబంధించి కేంద్రం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలుచేసింది. స్వలింగ సంపర్కాన్ని నేరమని పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్‌ 377ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం నుంచి చేపట్టిన సంగతి తెలిసిందే.

సెక్షన్‌ 377 పరిధి దాటి మరేదైనా విషయాన్ని కోర్టు పరిశీలించదలచుకుంటే, దాని ప్రభావం ఇతర చట్టాలపై తప్పక ఉంటుందని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. ‘వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్‌ 377పై నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు విచక్షణకే వదిలేస్తోంది. సెక్షన్‌ 377 పరిధి దాటి ఇతర విషయాల్ని కోర్టు పరిశీలించదలచుకున్నా, ఎల్జీబీటీ వర్గాల హక్కులకు సంబంధించి ఏదైనా తీర్పు ఇవ్వాలని నిర్ణయించుకున్నా, బదులుగా మరో సవివర అఫిడవిట్‌ దాఖలు చేస్తాం’ అని కేంద్రం తెలిపింది.  

అదో ఏవగింపు చట్టం..
ఇద్దరు వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కానికి సంబంధించిన చట్టాన్ని మాత్రమే పరిశీలిస్తామని, ఒకవేళ తాము అందులోని శిక్షార్హమైన నిబంధనలను తొలగిస్తే ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌) వర్గంపై ఉన్న అనర్హత తొలగిపోయి వారు కూడా త్రివిధ దళాల్లో చేరడంతో పాటు ఎన్నికల్లో పోటీచేస్తారని  ధర్మాసనం తెలిపింది. ఇదే జరిగితే అలాంటి సంబంధాలను సమాజంలో హీనంగా చూసే రోజులు పోతాయంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న ఇలాంటి చట్టం ‘సామాజిక ఏవగింపు’నకు ఉదాహరణ అని పేర్కొంది.

ఇలాంటి వాటిని చెల్లవని ప్రకటించడం సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు, ఎల్జీబీటీ వర్గీయులు గౌరవంగా జీవించేందుకు సాయపడుతుందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో స్వలింగ సంపర్కుల ఉపాధికి ఈ చట్టంలోని శిక్షార్హమైన నిబంధనలు తీవ్ర విఘాతంగా మారాయని తెలిపింది. అయినా, స్వలింగ సంపర్కం నేరమా? కాదా? అన్నదానిపైనే విచారణ జరుపుతామని, ఎల్జీబీటీ హక్కుల అంశం తమ ముందుకు రాలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సెక్షన్‌ 377ను సవాలు చేస్తూనే ఎక్కువ పిటిషన్లు దాఖలయ్యాయని కేంద్రం తెలపింది. ఆ పరిధిని దాటి విచారణ కోర్టు జరపాలనుకుంటే  చట్టబద్ధ దేశ ప్రయోజనాలను ఉటంకిస్తూ కౌంటర్‌ అఫిడవిట్‌ వేస్తామని కేంద్రం స్పష్టంచేసింది. కేంద్రానికి కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలుచేసే అవకాశం ఇవ్వకుండా, సెక్షన్‌ 377 కాకుండా ఇతర విషయాలపై విచారణ జరిపి, తీర్పు వెలువరించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది.  

వివాదం లేకుంటే విచారణ వద్దు..
కేంద్రం తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ స్పందిస్తూ..వివాదంలో లేని వ్యవహారాలపై విచారణ అక్కర్లేదని అన్నారు. తొలిరోజు విచారణ సందర్భంగా..‘జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు ప్రాథమిక హక్కు’ అన్న జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అందుకు జస్టిస్‌ చంద్రచూడ్‌ బదులిస్తూ సంక్లిష్ట విషయాల్లో తాము జోక్యం చేసుకోమని, ఇద్దరు వయోజనుల మధ్య సంబంధం ఆర్టికల్‌ 21కి సంబంధించిందా? కాదా? అనే విషయంపైనే దృష్టిపెడుతున్నామని స్పష్టతనిచ్చారు.  

మరిన్ని వార్తలు