బైక్ సవారీ యోధురాలు దుర్మరణం

12 Apr, 2016 11:06 IST|Sakshi
బైక్ సవారీ యోధురాలు దుర్మరణం

భోపాల్: దేశవ్యాప్తంగా మెరుపు వేగంతో తన బైక్తో చక్కర్లు కొడుతూ అందరినీ అబ్బురపరిచిన మేటి బైక్ రైడర్ వీణు పాలివల్ (44) మృతి చెందింది. అదుపుతప్పిన బైక్ పడిపోవడంతో ఆమెకు బలమైన గాయాలై దుర్మరణం చెందింది. ఈ సమయంలో ఆమెతోపాటు మరో బైక్ పై దిపేష్ తన్వార్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. సోమవారం సాయంత్రం భోపాల్కు 100 కిలోమీటర్ల దూరంలోని గ్యారస్పూర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన పాలివల్ కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా హర్లీ డేవిడ్ సన్ బైక్ పై చేసే సవారీ చూస్తే మాత్రం కళ్లు తేలేయాల్సిందే.

కనీసం 180 కిలో మీటర్ల వేగంతో ఆమె బైక్ నడుపుతుంది. దేశ వ్యాప్తంగా తన బైక్ జర్నీపై ఆమె డాక్యుమెంటరీ తీయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే మధ్యప్రదేశ్లోని విదిశ జిల్లాలోకి ప్రవేశించి సాగర్ అనే ప్రాంతం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే వేగంలో ఉన్న తన బైక్పై నియంత్రణ కోల్పోవడంతో అది బలంగా రోడ్డును తాకి పల్టీలు కొట్టింది. దీంతో పాలివల్ కు బలంగా గాయాలు కాగా విదిశలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఇటీవల  వీణు పాలివల్ ను లేడీ ఆఫ్ ది హర్లీ 2016గా కూడా ప్రకటించారు.

మరిన్ని వార్తలు