సింధుకు చేదు అనుభవం

5 Nov, 2017 02:35 IST|Sakshi

విమాన సిబ్బంది దురుసుగా ప్రవర్తించారంటూ ట్వీట్‌

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధుకు శనివారం ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో వెళ్తుండగా సంస్థకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బందిలో ఒకరు తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ట్వీటర్‌ ద్వారా తెలిపారు. ‘గ్రౌండ్‌ స్టాఫ్‌ అజితీశ్‌ నాతో చాలా దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించాడు. ప్రయాణికులతో అలా మాట్లాడవద్దని ఎయిర్‌హోస్టెస్‌ అతనికి సూచించగా, ఆమెతోనూ అనుచితంగా వ్యవహరించాడు. ఇలాంటి వాళ్లు ఇండిగోలో పనిచేస్తూ ఆ సంస్థకు చెడ్డపేరు తీసుకొస్తున్నారు’ అని ట్వీటర్‌ పోస్ట్‌లో సింధు వివరించారు.

అయితే ఇండిగో సంస్థ తమ ఉద్యోగికి మద్దతుగా నిలుస్తూ ‘సింధు అనుమతించిన దాని కన్నా అధిక లగేజీతో విమానమెక్కారు. అది ఆమె సీటు పైన ఉన్న క్యాబిన్‌లో పట్టడం లేదు. దానిని విమానంలోని కార్గోకు తరలిస్తామంటే ఆమె ఒప్పుకోలేదు. ప్రయాణికులెవరైనా ఎక్కువ సామానును తీసుకొస్తే మేం ఈ విధానాన్నే పాటిస్తాం. కానీ సింధు తన లగేజీ తనతోనే ఉండాలని పట్టుబట్టారు. చివరకు ఆమెను ఎంతగానో అభ్యర్థించి లగేజీని కార్గోకు తరలించాం. ఈ వ్యవహారం సాగుతున్నంత సేపు ఆమె ఆరోపణలు చేస్తున్న మా ఉద్యోగి మౌనంగానే ఉన్నారు’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అజితీశ్‌ ఓ ఉద్యోగిగా తన బాధ్యతలను మాత్రమే నిర్వర్తించారనీ, సింధు ఈ విషయాన్ని గుర్తిస్తారని తాము ఆశిస్తున్నట్లు సంస్థ పేర్కొంది.

మరిన్ని వార్తలు