ఇండిగో సర్వీసులు రద్దు.. నగరాలకు ఎఫెక్ట్‌

13 Mar, 2018 11:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తక్కువ ధరకే టికెట్లు అందిస్తూ సామాన్యుడు సైతం గగనయానం చేసేలా సర్వీసులు అందిస్తున్న ఇండిగో విమానయాన సంస్థ మంగళవారం 47 సర్వీసులను రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలు ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌, బెంగళూరు, పట్నా, శ్రీనగర్‌, భువనేశ్వర్‌, అమృత్‌సర్‌, గువాహటి తదితర నగరాలకు తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసింది. దీంతో ఆయా విమానాశ్రయాల్లో ప్రయాణీకులు చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు.

ఇంజిన్‌ పరమైన లోపాలు ఉన్నట్లు గుర్తించి ఇండిగో చెందిన 8 ఏ 320 విమానాలను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నిలిపివేసింది. దీంతోపాటు మరో మూడు గో ఎయిర్‌ విమానాలను కూడా ఆపేయించింది. ఈ నేపథ్యంలో ఇండిగో దేశీయ సేవలు అందించే 47 విమానాలను మంగళవారం రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని తన అధికారిక వెబ్‌సైట్‌లో కూడా పేర్కొంది. లక్నో వెళ్లాల్సిన ఓ ఇండిగో విమానం 40 నిమిషాల తర్వాత ఇంజిన్‌లో సమస్య ఏర్పడిందని తిరిగి అహ్మదాబాద్‌ తిరిగొచ్చింది. తరుచుగా ఇండిగోలోని ఏ 320 విమానాల్లో ఈ సమస్యలు వస్తున్నాయని, వాటిని పరిష్కరించేందుకు వెంటనే ఎనిమిది విమానాలను ఉన్నపలంగా ఆపేయాలని డీజీసీఏ ఆదేశించింది. 

మరిన్ని వార్తలు