ఇండిగో ప్రయాణికుడికి కరోనా..

27 May, 2020 09:16 IST|Sakshi
ప్రతికాత్మక​ చిత్రం

చెన్నై : కరోనా లాక్‌డౌన్‌ కారణంగా.. దాదాపు రెండు నెలల తర్వాత భారత్‌లో దేశీయ విమాన సర్వీసులు పున: ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇండిగో ఫ్లైట్‌లో ప్రయాణించిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. 24 ఏళ్ల ఓ వ్యక్తి సోమవారం చెన్నై నుంచి కోయంబత్తూరుకు ఇండిగో విమానంలో ప్రయాణించాడు. అయితే ఆ రోజు సాయంత్రం కోయంబత్తూరు చేరుకున్న అతనికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది. అయితే అతనికి కరోనా లక్షణాలు లేవని.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లలో అందరు ప్రయాణికులతో పాటు అతనికి కూడా స్క్రీనింగ్‌ నిర్వహించారని వైద్య అధికారులు తెలిపారు.

దీంతో ఆ విమాన సిబ్బందిని 14 రోజుల హోం క్వారంటైన్‌లో ఉంచనున్నారు. అలాగే ఈ విమానంలోని ఇతర ప్రయాణికులను హోం క్వారంటైన్‌ చేసి.. వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్నట్టు రాష్ట్ర వైద్య అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇండిగో సంస్థ కూడా ఒక ప్రకటన చేసింది. 25వ తేదీ సాయంత్రం చెన్నై నుంచి 6E-381 ఫ్లైట్‌లో ప్రయాణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు కోయంబత్తూరు ఎయిర్‌పోర్ట్‌ వైద్యుల నుంచి సమాచారం అందిందని తెలిపింది. ప్రయాణ సమయంలో అతని సమీపంలో ఎవరు కూర్చొలేదని.. అందువల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం తక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది. అతనిని ప్రస్తుతం కొయంబత్తూరులోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని చెప్పింది. కాగా, ఆ ప్రయాణికుడు చెన్నైలోని ఓ బార్‌ హోటల్‌లో అతను అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. (చదవండి: 42 మందికి కరోనా : నోకియా ప్లాంట్ మూత)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు