కుటుంబాన్ని వదిలివెళ్లింది : ఇండిగోకు రూ.61వేల ఫైన్‌

18 Sep, 2018 12:19 IST|Sakshi
ఇండిగో విమానం (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : నిర్దేశించిన సమయం కల్లా ప్రయాణికులందర్ని ఎక్కించుకుని టేకాఫ్‌ అవుతుంటాయి విమానాలు. ఎవరైనా రాకపోతే, ఒకటికి రెండు సార్లు అనౌన్స్‌మెంట్స్‌ కూడా చేస్తారు విమాన సిబ్బంది. ప్రయాణికులు కూడా ఎక్కడ విమానం మిస్‌ అవుతామేమో అని అర్థగంట ముందే బోర్డింగ్‌ పాస్‌ తీసుకుని వేచి చూస్తూ ఉంటారు. కానీ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రయాణికులకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. ఎలాంటి సమాచారం లేకుండానే కోల్‌కత్తా నుంచి అగర్తల వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ టేకాఫ్‌ అయి వెళ్లిపోయింది. ఎయిర్‌పోర్టులో వేచిచూస్తున్న ఓ ఫ్యామిలీ అలాగే ఆ విమానం కోసం ఎదురుచూస్తూ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారు. కానీ చివరికి ఆ విమానం వెళ్లిపోయిందని తెలిసి ఆశ్చర్యపోయారు ఆ కుటుంబ సభ్యులు. దీంతో చెప్పాపెట్టకుండా.. విమానం టేకాఫ్‌ అవడంపై ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై అపెక్స్‌ కన్జ్యూమర్‌ కమిషన్‌ నేషనల్‌ కన్జ్యూమర్‌ డిస్‌ప్యూట్స్‌ రిడ్రెస్‌ల్‌ను ఆశ్రయించారు. 

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ చేసిన ఈ తప్పిదానికి, కన్జ్యూమర్‌ కమిషన్‌ బెంచ్‌ రూ.61వేల పరిహారం విధించింది. ఇండిగో ఎయిర్‌లైన్‌ వేసిన రివ్యూ పిటిషన్‌ను సైతం కొట్టివేసింది. బెంచ్‌లో అధ్యక్షుడు జస్టిస్‌ ఆర్‌కే అగర్వాల్‌, సభ్యులు ఎం శిరీష ఉన్నారు. ప్రయాణికులను కాంటాక్ట్‌ చేయడంలో ఎయిర్‌లైన్‌ విఫలమైందని బెంచ్‌ పేర్కొంది. ‘మొబైల్‌ నెంబర్‌ ద్వారా ప్రయాణికులను ఇండిగో కాంటాక్ట్‌ చేయొచ్చు. విమాన టిక్కెట్‌ బుకింగ్‌ సమయంలోనే మొబైల్‌ నెంబర్‌ ఇవ్వడం తప్పనిసరి. విమాన టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నప్పుడు ప్రయాణికులు మొబైల్‌ నెంబర్‌ ఇచ్చారు కూడా. కానీ ఎందుకు వారికి కాల్‌ చేయలేదు’ అని బెంచ్‌ ప్రశ్నించింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ చేసిన తప్పిదానికి, తొలుత రూ.41వేల జరిమానా వేసింది. ఆ అనంతరం రివ్యూ పిటిషన్‌ విచారణ సమయంలో మరో రూ.20వేలను అదనంగా ఫైన్‌గా విధిస్తున్నట్టు కన్జ్యూమర్‌ కమిషన్‌ వెల్లడించింది. 

మరిన్ని వార్తలు