విమాన సేవలు దారుణం

6 Jan, 2018 02:38 IST|Sakshi

అధ్వానంగా చెక్‌–ఇన్‌ కౌంటర్లు

సిబ్బంది దురుసు ప్రవర్తన

న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో చెక్‌–ఇన్‌ కౌంటర్ల వద్ద పరిస్థితి అధ్వానంగా ఉందనీ,  సిబ్బంది తక్కువ ఉండడంతో బోర్డింగ్‌ పాస్‌ జారీ బాగా ఆలస్యమవుతోందని, దీంతో ప్రయాణికులు చాలా సార్లు విమానం మిస్‌అవుతున్నారని పార్లమెంటరీ స్థాయీ సంఘం (స్టాండింగ్‌ కమిటీ) నివేదించింది. ఈ నివేదికను  రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇండిగో వంటి చౌకధరల విమానయాన సంస్థల చెక్‌–ఇన్‌ కౌంటర్లలో ఈ సమస్య తీవ్రంగా ఉందని రవాణా, పర్యాటకం, సంస్కృతి విభాగాల స్థాయీ సంఘం తెలిపింది. కొన్ని సంస్థలు ఉద్దేశపూర్వకంగా ప్రయాణికులను చెక్‌–ఇన్‌ క్యూలో అధిక సమయం నిల్చోబెట్టి, వారు టికెట్‌ బుక్‌ చేసుకున్న విమానమెక్కే అవకాశం లేకుండా చేసి, ఆ తర్వాతి విమానంలో అధిక చార్జీలు చెల్లించి ప్రయాణించేలా అక్రమాలకు పాల్పడుతున్నాయని నివేదించింది.

విమానాశ్రయాల్లో ఆయా సంస్థలకు తగినన్ని చెక్‌–ఇన్‌ కౌంటర్లు ఉండేలా ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తున్న సంస్థలు చర్యలు తీసుకోవాలనీ, రద్దీ సమయాల్లో చెక్‌–ఇన్‌ కౌంటర్లలో సిబ్బందిని పెంచాలని సూచించింది. బోర్డింగ్‌ పాస్‌ పొందడానికి ప్రయాణికులు 10 నిమిషాలకు మించి ఎక్కువ సేపు క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండకూడదంది. ఇటీవల ఇండిగో సిబ్బంది ఓ ప్రయాణికుడిని కిందపడేసి కొట్టడాన్ని కమిటీ ఆక్షేపించింది. ఇది సంస్థాగతమైన సమస్య అనీ, ప్రయాణికుల పట్ల ఆ సంస్థ ఉద్యోగులు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించింది.   కొన్నిసార్లు విమానసంస్థలు టికెట్‌ రేట్లను 10 రెట్లు పెంచేసి అడ్డగోలు దోపిడీకి దిగుతున్నాయనీ, ఈ విషయం పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని స్థాయీ సంఘం నివేదికలో పేర్కొంది.  టికెట్‌ రద్దు చార్జీలు కూడా బేస్‌ ఫేర్‌లో 50 శాతానికి మించకుండా నియంత్రణ విధించాలని కమిటీ సూచించింది.

మరిన్ని వార్తలు