ఇండో–చైనా సరిహద్దులో ఉద్రిక్తత

11 May, 2020 03:35 IST|Sakshi

ఇరుదేశాల సైనికుల బాహాబాహీ

పలువురికి గాయాలు

లద్దాఖ్, సిక్కింలో ఘటనలు

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తూర్పు లద్దాఖ్, ఉత్తర సిక్కింలోని నకూ లా పాస్‌ ప్రాంతాల్లో సరిహద్దుల వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ  ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారని భారత సైన్యాధికారులు ఆదివారం వెల్లడించారు. తొలి ఘటనలో.. మే 5న సాయంత్రం తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్‌ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా దళాలకు చెందిన దాదాపు 200 మంది బాహాబాహీకి దిగడంతోపాటు, రెండు వైపులా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు.

కొన్ని గంటల పాటు ఈ ఘర్షణ కొనసాగింది. చర్చల అనంతరం మర్నాడు ఉదయానికి అది ముగిసింది. ఈ గొడవలో ఇరుదేశాల సైనికులు గాయపడ్డారు. ఓ సమయంలో ఉద్రిక్తత పెరగడంతో రెండు దేశాలు మరిన్ని దళాలను ఆ ప్రాంతానికి తరలించాయి. ఈ ఘర్షణలో ఎంతమంది భారతీయ సైనికులు గాయపడ్డారనే వివరాలను అధికారులు ఇవ్వలేదు. మరో ఘటనలో.. సిక్కింలోని నకూ లా పాస్‌ వద్ద ఇరుదేశాలకు చెందిన సుమారు 150 మంది సైనికులు బాహాబాహీకి దిగి పిడిగుద్దులతో ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. ఈ ఘటనలో 10 మంది భారతీయ సైనికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

స్థానిక స్థాయి చర్చల అనంతరం ఇరువర్గాలు వెనక్కు తగ్గాయన్నారు. ‘సరిహద్దు సమస్య తేలకపోవడంతో ఇరు దేశాల సైనికుల మధ్య ఈ ప్రాంతాల్లో తాత్కాలిక, చిన్నస్థాయి ఘర్షణలు సాధారణమే. సిబ్బంది ఆవేశపూరిత మనస్తత్వం వల్ల కూడా ఘర్షణలు చోటు చేసుకుంటాయి. చిన్నపాటి గాయాలతో ముగుస్తాయి’ అని వివరించారు. భారత్, చైనాల మధ్య 2017లో డోక్లాం ట్రై జంక్షన్‌ వద్ద 73 రోజుల పాటు యుద్ధం స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవ నియంత్రణ రేఖగా పేర్కొనే 3,488 కి.మీ. పొడవైన సరిహద్దుపై వివాదం కొనసాగుతోంది.    

ఐబీజీలు సిద్ధం : ఆర్మీ చీఫ్‌
ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ‘సమగ్ర యుద్ధ బృందాలు (ఇంటిగ్రేటెడ్‌ బ్యాటిల్‌ గ్రూప్స్‌–ఐబీజీ)’ విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని, కరోనా కారణంగా దీని అమలును కొంతకాలం వాయిదా వేశామని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవణె తెలిపారు. యుద్ధ సామర్థ్యాలను పెంచుకునే దిశగా ప్రయోగాత్మకంగా పదాతి దళం, శతఘ్ని దళం, వైమానిక దళం, లాజిస్టిక్‌ యూనిట్స్‌లతో ‘ఐబీజీ’లను ఏర్పాటు చేశారు. సుమారు 5 వేల మంది సిబ్బంది ఉండే ప్రతీ ఐబీజీకి ఒక మేజర్‌ జనరల్‌ నేతృత్వం వహిస్తారు. ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వారు సుశిక్షితులై ఉంటారు. ముఖ్యంగా పాక్, చైనా సరిహద్దుల్లో వీటిని మోహరించాలని ప్రణాళిక రచించారు.  చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత పర్యటనకు ముందు ప్రయోగాత్మకంగా ఐబీజీల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అరుణాచల్‌ ప్రదేశ్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు