ఆస్పత్రిలో చేరిన ఇంద్రాణి ముఖర్జియా

2 Jun, 2018 08:44 IST|Sakshi
షీనాబోరా హత్యకేసు, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా (పాత ఫొటో)

ముంబై : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ప్రధాన నిందితురాలు, షీనా బోరా హత్య కేసులో బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఆమెను జేజే ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు సమాచారం. కాగా షీనా బోరా హత్య కేసులో భాగంగా కోర్టుకు హాజరైన ఇంద్రాణి వ్యక్తిగత కార్యదర్శి కాజల్‌ శర్మ గురువారం పలు సంచలన విషయాలు వెల్లడించారు.

షీనా హత్య తర్వాత తమ అవసరాల నిమిత్తం ఇంద్రాణి ముఖర్జియా తనచేత షీనా పేరుతో మెయిల్‌ ఐడీ క్రియేట్‌ చేయించారని, తనకు తేదీలు అంతగా గుర్తుకులేవని, అయితే 2012జూన్‌-జూలై నెలల్లో ఈ పని చేసినట్లు కాజల్‌ శర్మ ఒప్పుకున్నారు. ఇంద్రాణి అరెస్టయ్యే వరకు కూడా షీనా బోరాకు సోదరిగానే ఆమె తెలుసునన్నారు. షీనా ఇంద్రాణి సోదరి కాదు కూతురని తెలిసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఇంద్రాణి దగ్గర ఉద్యోగంలో చేరిన తర్వాత పనిభారం పెరిగిపోయిందని, నమ్మకంగా పని చేయడం తప్ప తానేం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇంద్రాణి ఆస్పత్రిలో చేరడం గమనార్హం​. కాగా ఆమె ఇది వరకు కూడా పలుమార్లు అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు