షహీన్‌బాగ్‌ శిశువు మృతి

4 Feb, 2020 05:26 IST|Sakshi
ఏడాది కొడుకుతో మహ్మద్‌ ఆరిఫ్, నజియా

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో నిరసన తెలుపుతున్న నాలుగు నెలల శిశువు మృతిచెందాడు. బాలుడు నిరసన తెలపడం ఏంటి అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. షహీన్‌బాగ్‌ వద్ద నిరసనలో పాల్గొనడానికి మహ్మద్‌ జహాన్‌ అనే బాలుడిని అతని తల్లి ప్రతిరోజూ తనతోపాటు అక్కడికి తీసుకెళ్లేది. అక్కడ ఉన్న నిరసనకారులంతా కూడా జహాన్‌ను ముద్దుచేసేవారు. అలాగే బాలుడి బుగ్గ మీద త్రివర్ణ పతాకాన్ని రంగులతో వేసేది. కానీ, ఆ పాలబుగ్గల చిన్నారి ఇక నుంచి కనబడడు. చలితీవ్రత పెరగడంతో,  తట్టుకోలేక ఆ చిన్నారి కన్నుమూశాడు.

అయినప్పటికీ జహాన్‌ తల్లి ఆ నిరసనల్లో పాల్గొనడానికి నిశ్చయించుకోవడం గమనార్హం. ‘నేను నా పిల్లల భవిష్యత్తు కోసం అందులో పాల్గొంటాను’ అని తెలిపింది. జహాన్‌ తల్లిదండ్రులు మహ్మద్‌ ఆరిఫ్, నజియా బట్లా హౌజ్‌ ప్రాంతంలో ప్లాస్టిక్‌ షీట్లు, వస్త్రాలతో చేసిన ఓ చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. వారికి మరో ఇద్దరు ఐదేళ్ల కుమార్తె, ఒక సంవత్సరం కొడుకు ఉన్నారు. ‘జహాన్‌ జనవరి 30వ తేదీనే మృతిచెందాడు. షహీన్‌బాగ్‌ ప్రాంతం నుంచి ఆరోజు రాత్రి 1 గంటకు ఇంటికొచ్చి జహాన్‌ను నిద్రపుచ్చి నేను కూడా నిద్రపోయాను. ఉదయం లేవగానే తాను కదలకపోవడాన్ని గమనించాను. తను నిద్రలోనే చనిపోయాడు’ అని నజియా వెల్లడించింది.

మరిన్ని వార్తలు