ప్రత్యేక విమానంలో భారత్‌కు ఇన్ఫోసిస్‌ ఉద్యోగులు

7 Jul, 2020 17:11 IST|Sakshi

ఖతార్​ ఎయిర్​వేస్​ విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చిన కంపెనీ

సాక్షి, బెంగళూరు: అసలే కరోనా కష్టకాలం.. అంతలో అమెరికాలో పని చేస్తున్న భారతీయులపై ట్రంప్ పిడుగు.. వీసా రెన్యూవల్​కు దరఖాస్తు చేసుకున్న వారికి అదెప్పుడు ఆమోదం పొందుతుందో తెలీదు. కొందరికి గడువు కూడా పూర్తైపోయింది. పోనీ తిరిగి ఇండియాకు వద్దామా అంటే విమానాల రాకపోకలు నిలిపేశారు. ఇలా అమెరికాలో కష్టాలు పడుతున్న తమ ఉద్యోగులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్​ సంస్ధ నడుంబిగించింది. (అర్జంట్ బాత్రూం: 185 కిమీ వేగంతో డ్రైవింగ్)

ప్రత్యేక విమానంలో 206 మంది (ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిపి)ని సోమవారం బెంగుళూరుకు తీసుకొచ్చింది. ఈ విషయాన్ని సంస్ధ అసోసియేట్ వైస్​ ప్రెసిడెంట్​ సంజీవ్​ బోడే లింక్డ్​ ఇన్​ ద్వారా వెల్లడించారు. ‘కోవిడ్​–19 మన జీవితాలపై ఊహించని స్ధాయిలో ప్రభావం చూపింది. అమెరికాలో పని చేస్తున్న కొందరు ఇన్ఫోసిస్​ ఉద్యోగుల వీసా గడువు ముగిసిపోయింది. విమానాల రాకపోకలు ఆగిపోయాయి. అందుకే వారిని కుటుంబాలతో ఇండియాకు తీసుకురావడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాం. వాళ్లు బెంగళూరుకు వచ్చేశారు కూడా. దీంతో కొన్ని వారాల డైలమాకు శుభం కార్డు పడింది’ అని బోడే రాసుకొచ్చారు. (రక్తదానం చేసిన కుక్క)

ఇన్ఫోసిస్​ వార్షిక నివేదిక ప్రకారం కంపెనీకి అమెరికాలో 17,709 మంది ఉద్యోగులు ఉన్నారు. అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో, చాలా మంది తమను తిరిగి స్వదేశానికి చేర్చాలని కంపెనీకి విన్నవించుకున్నారు. ఇండియాకు వచ్చిన 76 మంది ఉద్యోగులు హెచ్​1బీ, ఎల్​1 వీసాలతో కంపెనీ అమెరికా కార్యాలయంలో పని చేసేవారు. ట్రంప్​ నిర్ణయంతో.. వీసాలు రెన్యువల్​ కావనే భావనతోనే ఇన్ఫోసిస్​ ఉద్యోగులను తిరిగి భారత్​కు తెచ్చిందని సమాచారం.

ఉద్యోగులను ఖతార్​ ఎయిర్​వేస్​కు చెందిన విమానంలో శాన్​ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారని తెలిసింది. ఆ తర్వాత చాలామంది ఇన్ఫోసిస్​ ఉద్యోగులు కంపెనీని ప్రశంసిస్తూ ట్వీట్స్​ చేశారు. భువనేశ్వర్​లో వరదలు వచ్చినప్పుడు కూడా ఇన్ఫోసిస్​ కంపెనీ చార్టర్​ విమానంలో 500 మంది ఉద్యోగులను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు