కార్డియో వాస్కులర్‌కు సూదిమందు

25 May, 2016 02:02 IST|Sakshi
కార్డియో వాస్కులర్‌కు సూదిమందు

మన శాస్త్రవేత్తలు కనుగొన్నారన్న కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్థన్
బ్యాక్టీరియాను తట్టుకునే వరి వంగడాన్ని సీసీఎంబీ తయారు చేసినట్లు వెల్లడి
సీఎస్‌ఐఆర్ శాస్త్రవేత్తల కృషితో డీజిల్‌తో నడిచే చిన్న ట్రాక్టర్ తయారీ
రాష్ట్రాల పాత్రికేయులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రెస్‌మీట్
 
 సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతకమైన కార్డియో వాస్కులర్ వ్యాధులకు సూదిమందు రూపంలో ప్రొటీన్ అందించి ప్రాణాలు కాపాడే ఔషధాన్ని మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి డాక్టర్ హర్షవర్థన్ వెల్లడించారు. సీఎస్‌ఐఆర్‌కు చెందిన శాస్త్రవేత్తలు గుండె నాళాల్లోని రక్తపు గడ్డలను తొలగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి(క్లాట్‌లను తొలగించే స్ట్రెప్టోకినేస్) రూపకల్పన చేశారని తెలిపారు. క్లాట్ల ఆధారిత త్రాండోలిటిక్ ఔషధానికి ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ అనుమతి లభించిందని, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. క్లాట్లను కరిగించే కొత్త తరానికి చెందిన ఔషధాలనూ తయారుచేశారన్నారు.
 
దేశీయం గా తయారైన ఈ స్ట్రెప్టోకినేస్ అందరికీ అందుబాటు ధరలో ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పాత్రికేయులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఢిల్లీ నుంచి మాట్లాడారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా తన మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను హర్షవర్థన్ వెల్లడించారు. మధుమేహ చికిత్స కోసం వనమూలికలతో తయారైన బీజీఆర్-34 ఫార్ములేషన్‌కు ఆయుష్ శాఖ అనుమతి లభించిందని, దీన్ని వాణిజ్యపరంగా తయారుచేసేందుకు ఢిల్లీకి చెందిన ఒక కంపెనీకి లెసైన్స్ ఇచ్చామన్నారు.

ఒక్కోటి రూ.5 ఉండే ఈ మూలికా ఔషధంతో తయారైన మాత్రలను ఇప్పటికే ఉత్తర భారతంలో కొన్నిచోట్ల విడుదల చేశామన్నారు. అతిసారను నిరోధించి పిల్లల జీవితాలను కాపాడే మరో కీలక ఔషధం రోటావైరస్ వ్యాక్సిన్ దేశీయంగానే తయారైందన్నారు. దీనివల్ల ఏటా ఐదు లక్షల మంది పిల్లల ప్రాణాలు అతిసారానికి బలికాకుండా కాపాడవ చ్చన్నారు.
 
బ్యాక్టీరియాను తట్టుకునే సాంబమసూరి..
సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ(సీసీఎంబీ), వరి పరిశోధన డెరైక్టరేట్(డీఆర్‌ఆర్) శాస్త్రవేత్తలు ఉమ్మడిగా బ్యాక్టీరియాను తట్టుకునే వరి వంగడం ‘సాంబమసూరి’ని అభివృద్ధి చేశారని హర్షవర్థన్ తెలిపారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటక, తమిళనాడుల్లో 90 వేల హెక్టార్లలో పండిస్తున్నారన్నారు. వివేక్ 9 పేరిట అధిక ప్రొటీన్, అధిక ప్రో విటమిన్ ఏ ఉన్న హైబ్రీడ్ మొక్కజొన్న వంగడాన్ని విడుదల చేశామన్నారు. రూ.2 లక్షల ధరలోనే అందుబాటులో ఉండే 11.2 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన చిన్న డీజిల్ ట్రాక్టర్‌ను సీఎస్‌ఐఆర్ శాస్త్రవేత్తలు రూపొందించారన్నారు. వచ్చే మూడేళ్ల కాలాన్ని జనవిజ్ఞాన్ యుగంగా మంత్రి అభివర్ణించారు.
 
ప్రధాని నాయకత్వంలో పలు ప్రాజెక్టులను రూపొందించామన్నారు. దేశంలో 15 వ్యవసాయ వాతావరణ జోన్లలో దశలవారీగా ‘బయోటెక్-కిసాన్’ అమలు చేయబోతున్నామన్నారు. చిన్నసన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక అంశాలను అనుసంధానం చేస్తూ చేపడుతోన్న ప్రాజెక్టు ఇదన్నారు. 2015 మార్చిలో రూ.4,500 కోట్లతో కేంద్రం సూపర్ కంప్యూటింగ్ మిషన్‌కు అనుమతిచ్చిందన్నారు.

దేశవ్యాప్తంగా 70 అత్యున్నత సామర్థ్యం కలిగిన కంప్యూటింగ్ వసతులు ఏర్పాటు చేయడం ద్వారా విస్తృత కంప్యూటింగ్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయడం దీని లక్ష్యమన్నారు. రెండేళ్లుగా వాతావరణం, తుపాన్ల గుర్తింపు నైపుణ్యాల్లో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో ఇచ్చిన ప్రమాద హెచ్చరికల వల్ల వర్షపాతం సాంద్రత, తుఫాన్ తీరాన్ని తాకే సమయాన్ని చక్కగా గుర్తించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా ప్రజల ప్రాణాలు కాపాడగలిగారని హర్షవర్థన్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు