జోరు పెంచిన విచారణ కమిషన్‌..

23 Dec, 2017 10:58 IST|Sakshi

విచారణ వలయంలో అత్యంత ప్రముఖులు

శశికళ, ప్రతాప్‌ సీ రెడ్డి, ప్రీతారెడ్డికి జయ విచారణ కమిషన్‌ సమన్లు  

విచారణ కమిషన్‌ గడువు మరో ఆరునెలలు పెంపు

అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌  విచారణ జోరును పెంచింది. అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ, అపోలో చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతారెడ్డిలకు శుక్రవారం సమన్లు జారీచేయడం ద్వారా విచారణ 
కీలకదశకు చేరుకుంది.

సాక్షి, చెన్నై: అమ్మ అనారోగ్యం, 75 రోజుల తరువాత ఆకస్మిక మరణం ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత కోసం తమిళనాడు ప్రభుత్వం తరపున వివిధ విభాగాలకు చెందిన వైద్యుల బృందం, ఢిల్లీ నుంచి ఎయిమ్స్‌ వైద్యులు విదేశాల నుంచి ప్రత్యేక వైద్య నిపుణులు...ఇలా అమ్మకు అంతర్జాతీయ స్థాయిలో వైద్యం అందింది. జయకు కేవలం జ్వరం, డీ హైడ్రేషన్‌లతో స్వల్ప అనారోగ్యమేనని చేరిన వెంటనే అపోలో ఆసుపత్రి బులెటిన్‌ విడుదల చేసింది. 

నిజాన్ని దాచాల్సి వచ్చింది..
అయితే అదంతా అబద్దమని, వాస్తవానికి జయ విషమ పరిస్థితిలో చేరారని అపోలో ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డి ఇటీవల ప్రకటించారు. జయకు తీవ్ర అనారోగ్యం అని ప్రకటిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు తలెత్తుతాయనే ఆలోచనతో నిజాన్ని దాచాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. అంతకు కొన్నినెలల ముందే మంత్రి దిండుగల్లు శ్రీనివాసన్‌ సైతం అమ్మ ఆరోగ్యం విషయంలో అనేక అబద్ధాలు ఆడాం, మన్నించండి అని బహిరంగసభలో ప్రజలను వేడుకున్నాడు. ఇలాంటి అనుమానాలు.. పెనుభూతాల నడుమ తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబరు 25వ తేదీన జయ మరణంపై విచారణ కమిషన్‌ వేసింది. 

రిటైర్డు న్యాయమూర్తి ఆర్ముగస్వామి విచారణ ప్రారంభించారు. డీఎంకే వైద్యవిభాగ కార్యదర్శి డాక్టర్‌ శరవణన్‌ కమిషన్‌ ముందు హాజరై...అమ్మ చనిపోయిన స్థితిలో వేలిముద్రలు సేకరించి ఉప ఎన్నికలకు బీ ఫారం విడుదల చేశారని వాంగ్మూలం ఇచ్చి సంచలనం రేపారు. ఆ తరువాత జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్, దీప భర్త మాధవన్, తమిళనాడు ప్రభుత్వ మాజీ సీఎస్‌లు షీలా బాలకృష్ణన్, రామమోహన్‌రావు తదితర ముఖ్యులు తమ వాంగ్మూలం ఇచ్చారు.

విచారణలో కీలక ఘట్టం..
 ఇదిలా ఉండగా, విచారణలో భాగంగా శశికళ, ప్రతాప్‌ సీ రెడ్డి, ప్రీతారెడ్డిలకు కమిషన్‌ శుక్రవారం సమన్లు పంపడంతో జయ మరణంపై జరుగుతున్న విచారణ కీలక ఘట్టానికి చేరుకుంది. జయ ఆసుపత్రికి వచ్చినపుడే విషమపరిస్థిలో ఉన్నారని ప్రతాప్‌ సీ రెడ్డి చెప్పగా అంతకు కొన్ని నిమిషాల ముందు ఇంట్లో జయకు ఏమి జరిగిందనే ప్రశ్న తలెత్తింది. జయకు సీరియస్‌ అయిన సమయంలో శశికళ మాత్రమే ఉంది. జయ ఆసుపత్రిలో ఉండగా ఆమెకు అందుతున్న వైద్యసేవలను అపోలో ఆసుపత్రి చైర్మన్‌ ప్రతాప్‌ సీ రెడ్డి, అపోలో గ్రూప్‌ ఎగ్జిక్యుటివ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి పర్యవేక్షించారు. దీంతో విచారణ కమిషన్‌ ఈ ముగ్గురికీ సమన్లు జారీచేసింది. బెంగళూరు జైలు అధికారుల ద్వారా శశికళకు ఈ సమన్లు అందాయి. 15 రోజుల్లోగా బదులివ్వాలని శశికళను కమిషన్‌ ఆదేశించింది. శశికళ తరఫున ముందుగా ఆమె న్యాయవాది హాజరై వాంగ్మూలం ఇస్తారు. 

అందుకు కమిషన్‌ సంతృప్తి చెందని పక్షంలో శశికళను నేరుగా పిలిపించుకుని లేదా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారిస్తారని సమాచారం. అలాగే ప్రతాప్‌ సీ రెడ్డికి పదిరోజుల గడువు ఇచ్చారు. ఈ లెక్కన వచ్చే ఏడాది జనవరి 2వ తేదీన కమిషన్‌ ముందు ఆయన హాజరుకావాల్సి ఉంటుంది. అలాగే జయకు సంబంధించి ఆసుపత్రి విడుదల చేసిన అన్ని బులెటిన్లు పదిరోజుల్లోగా కమిషన్‌ కు అందజేయాలని ఆదేశాలు జారీఅయ్యాయి. ప్రీతారెడ్డి సమన్ల వివరాలు తెలియరాలేదు. ఇదిలా ఉండగా, జయవిచారణ కమిషన్‌ నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన మూడునెలల గడువు వచ్చే ఏడాది జనవరి 25వ తేదీతో ముగుస్తుంది. ఇంకా అనేక అంశాలు విచారణ రావాల్సిన కారణంగా గడువును మరో ఆరునెలలు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 

>
మరిన్ని వార్తలు