దినకరన్‌కు నోటీసులు..!

28 Dec, 2017 07:38 IST|Sakshi

దినకరన్‌కు విచారణ కమిషన్‌ నోటీసులు

కృష్ణప్రియ, పూంగున్రలకు సైతం

వారంలోగా పత్రాలు దాఖలు చేయాలని ఆదేశం

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆకస్మిక మరణం రాను రానూ అనుమానాస్పద మృతిగా మారిపోతున్న తరుణంలో జయ మరణ విచారణ కమిషన్‌ టీటీవీ దినకరన్‌కు బుధవారం నోటీసులు జారీచేసింది. అలాగే శశికళ మేనకోడలు, ఇళవరసి కుమారై్తన కృష్ణప్రియ, జయలలితకు అంతరంగిక కార్యదర్శిగా వ్యవహరించిన పూంగున్రన్‌లకు నోటీసులు జారీ అయినాయి. జయ మరణంపై అనేక అనుమానాలు తలెత్తడంతో సీఎం ఎడపాడి సెప్టెంబరు 25 వ తేదీన విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 

రిటైర్డు న్యాయమూర్తి అరుముగస్వామి చైర్మన్‌గా నియమితులైనారు. గత నెల 22వ తేదీన విచారణ ప్రారంభం కాగా, డీఎంకే లీగల్‌సెల్‌ కార్యదర్శి డాక్టర్‌ శరవణన్, జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్, దీప భర్త మాధవన్, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు షీలా బాలకృష్ణన్, రామమోహన్‌రావు సహా ఇప్పటి వరకు 28 మంది కమిషన్‌ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. వీరుగాక మరో 422 మంది కమిషన్‌కు వినతిపత్రాలు సమర్పించారు. 

అపోలో ఆసపత్రి చైర్మన్‌ ప్రతాప్‌ సీ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ ప్రీతారెడ్డి, శశికళ సైతం విచారణ కమిషన్‌ నుండి నోటీసులు అందుకున్నారు. ఈ ముగ్గురు కమిషన్‌ ముందు హాజరుకావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, అపోలో ఆసుపత్రిలో జయ చికిత్స దృశ్యాలను ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ ముందు దినకరన్‌ అనుచరుడైన బహిషృత ఎమ్మెల్యే వెట్రివేల విడుదల చేయడాన్ని కమిషన్‌ తీవ్రంగా తప్పుపట్టింది.

వీడియోల విడుదల నేరం:
విచారణ జరుగుతున్న సమయంలో వీడియో విడుదల చేయడం నేరమని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కమిషన్‌ ఆదేశాల మేరకు వీడియో ఆధారాలను తన న్యాయవాది ద్వారా వెట్రివేల్‌ కమిషన్‌కు అందజేశాడు. జయలలిత చికిత్సకు సంబంధించి తన వద్ద మరిన్ని దృశ్యాలు ఉన్నాయని కృష్ణప్రియ మీడియాకు చెప్పడం కమిషన్‌ నుండి నోటీసులకు కారణమైంది.  

వచ్చేనెల 2వ తేదీన కృష్ణప్రియ కమిషన్‌ ముందు హాజరుకావాల్సి ఉంది. జయలలిత వీడియోకు సంబంధించి మరిన్ని ఆధారాలుంటే వారంలోగా అందజేయాలని పేర్కొంటూ దినకరన్‌కు నోటీసులు అందాయి. జయ చికిత్సకు సంబంధించిన వీడియోల విడుదలపై విచారణ కమిషన్‌ నిషేధం విధించింది.

>
మరిన్ని వార్తలు