కాళేశ్వరం విస్తరణపై ఎన్జీటీలో విచారణ 

23 Jul, 2020 04:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై వేముల్గాట్‌ భూనిర్వాసితులు దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్‌ చెన్నై బెంచ్‌ విచారించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే భారీ విస్తరణ పనులు చేపట్టారని పిటిషనర్లు ధర్మాసనానికి నివేదించారు. కాళేశ్వరం ద్వారా రెండు టీఎంసీలు ఎత్తిపోసేందుకు మాత్రమే పర్యావరణ అనుమతులు ఉన్నాయని  పేర్కొన్నారు. అనుమతులు లేకుండా పనులు జరపరాదని ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖ లైన పిటిషన్‌ ఢిల్లీ బెంచ్‌లో పెండింగ్‌లో ఉన్న విషయంపై చెన్నై బెంచ్‌ ఆరాతీసింది. ఒకే ప్రాజెక్టుపై 2 బెంచ్‌ల్లో విచా రణ సాధ్యమేనా అని చెన్నై బెంచ్‌ న్యాయ విభాగం సభ్యుడు జస్టిస్‌ రామకృష్ణన్‌ ప్రశ్నించారు.

కాగా, ఢిల్లీలో పెండింగ్‌ కేసుకు, ప్రస్తుత కేసుకు సంబంధం లేదని, తెలంగాణ చెన్నై బెంచ్‌ పరిధి లో ఉన్నందువల్ల సౌత్‌ జోన్‌ బెంచ్‌లో కేసు వేశామని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్‌ కుమార్‌ నివేదించారు. కేసును చెన్నై బెంచ్‌ విచారిం చినా, ఢిల్లీ ప్రధాన బెంచ్‌కు బదిలీ చేసినా తమకు అభ్యంతరం లేదని విన్నవించారు. ఢిల్లీ బెంచ్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కేసు పెండింగ్లో ఉన్నందు వల్ల చెన్నైలో విచారణ సరికాదని తెలంగాణ అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ రాంచందర్‌రావు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ రామకృష్ణన్‌ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్‌ కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై దాఖలైన పిటిషన్‌ చెన్నై బెంచ్‌ విచారించవచ్చా లేదా అనేదానిపై ఆదేశాలివ్వాలని ఢిల్లీ ప్రధాన బెంచ్‌ను కోరుతూ కేసు తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు