కాక్ ట్రోఫీ గెలుచుకున్న విరాట్

26 Dec, 2015 16:56 IST|Sakshi
కాక్ ట్రోఫీ గెలుచుకున్న విరాట్

భారత నౌకాదళంలోని విమానవాహక నౌక ఐఎన్ఎస్ విరాట్.. మరో ఘన విజయం సాధించింది. వెస్ట్రన్‌ ఫ్లీట్ వేలర్ పుల్లింగ్ రెగట్టా పోటీలలో 'కాక్ ట్రోఫీ'ని గెలుచుకుంది. త్వరలోనే డీకమిషన్ అవబోతున్న తరుణంలో కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈ పోటీలలో ఓవరాల్ విన్నర్‌గా ఐఎన్ఎస్ విరాట్‌ను ప్రకటించి, కాక్ ట్రోఫీ అందించారు. చాలా గట్టి పోటీ ఉన్న ఈ రేసులో.. మరో విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య రన్నరప్‌గా నిలిచింది. తదుపరి రెగట్టా జరిగేవరకు గెలిచిన నౌకను 'కాక్ షిప్' అని పిలుస్తారు.

నౌకాదళ ఉప అధిపతి వైస్ అడ్మిరల్ ఎస్‌పీఎస్ చీమా ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. మంచి క్రీడాస్ఫూర్తి, టెక్నిక్, ఉత్సాహం చూపించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని ఆయన అన్నారు. వేలర్ అనేది 27 అడుగుల పొడువన్న బోటు. దీన్ని ఐదుగురు 'పుల్లర్లు' 17 అడుగుల పొడవున్న తెడ్లతో 1.3 కిలోమీటర్ల మేర తీసుకెళ్తారు. రెగట్టా జరిగేందుకు కొన్ని నెలల ముందు నుంచి దీని కోసం కఠోరమైన కృషి చేస్తారు. ఐఎన్ఎస్ విరాట్ తొలుత 30 ఏళ్ల పాటు బ్రిటిష్ నౌకాదళంలో పనిచేశాక, భారత్ దాన్ని కొనుగోలు చేసింది. 1987లో దానికి పూర్తిగా మార్పుచేర్పులు చేసి భారత నౌకాదళంలోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు