సెభాష్‌..ఇన్‌స్పెక్టర్‌ గాంధీ..!

26 Nov, 2017 19:07 IST|Sakshi

సాక్షి, చెన్నై: సందు దొరికితే చాలు.. గుడినీ గుడిలో లింగాన్నీ మింగేసే ఘనులున్న ఈ రోజుల్లో.. తనకు దొరికిన రూ. 40లక్షలను ఇన్‌స్పెక్టర్‌ ‘గాంధీ’  సంబంధీకులకు అప్పగించి పేరు నిలుపుకున్నాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలివి.. శుక్రవారం రెండు కార్లు ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మృతుల్లో విరుదునగర్‌ జిల్లా ముత్తు నాయకన్‌ పట్టికి చెందిన వ్యాపార వేత్త క్రిస్టోఫర్‌(70)  కూడా ఉన్నారు. ఆయన ప్రయాణించిన కారులో రూ. 40 లక్షలు ఉండటాన్ని తిరుమంగళం ఇన్‌స్పెక్టర్‌ గాంధీ గుర్తించారు. ఆ మొత్తాన్ని భద్ర పరిచారు.

ఇన్‌స్పెక్టర్‌ ఆదివారం ముత్తునాయకన్‌ పట్టికి వెళ్లి మృతుడు క్రిస్టోఫర్‌ కుమార్తె మేరికి రూ. 40 లక్షలను అప్పగించారు. తండ్రి వ్యాపార నిమిత్తం తీసుకెళ్లిన ఆ సొమ్ము పోయిందనుకున్నామని.. అయితే, ఇన్‌స్పెక్టర్‌ తీసుకొచ్చి ఇవ్వడం అభినందనీయమని మేరి అన్నారు. చేతికి దొరికితే చాలు సినీ ఫక్కీలో కాజేసే పోలీసులు ఉన్న ఈ కాలంలో తన పేరుకు తగ్గట్టు గాంధీ తన ఔదార్యాన్ని చాటుకోవడంతో ముత్తు నాయకన్ పట్టి ప్రజలు ఆయన్ను అభినందనల్లో  ముంచెత్తారు.

మరిన్ని వార్తలు