ప్రసాదంలో విషం కలిపి..

25 Jul, 2019 18:23 IST|Sakshi

ముంబై : ముం‍బ్రేశ్వర్‌ ఆలయంలో భక్తులకు ఇచ్చే మహా ప్రసాదంలో విషం కలిపి 400 మందిని చంపాలనే ఉగ్ర కుట్రను పోలీసులు ఛేదించారు. ఈ ఏడాది జనవరిలో ముంబై సమీపంలోని ముంబ్రాలో అరెస్టయిన ఉగ్రవాదుల బృందం ఈ మేరకు పథకరచన చేసిందని మహారాష్ట్ర ఏటీఎస్‌ అధికారులు ముంబై కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు.

ఐఎస్‌తో పాటు ఇస్లాం ప్రబోధకుడు జకీర్‌ నాయక్‌ల ప్రేరణతో వారు ఈ ఘాతుకానికి తెగబడినట్టు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. నిందితుల సోషల్‌ మీడియా ప్రొఫైల్‌లో జకీర్‌ నాయక్‌కు సంబంధించిన పలు వీడియోలు ఉండటం గమనార్హం. 400 మంది హిందూ భక్తులను చంపే ఉద్దేశంతో ప్రసాదంలో విషం కలిపేందుకు వారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ముంబ్రేశ్వర్‌ ఆలయాన్ని వారు ఎంపిక చేసుకున్నారు. థానే జిల్లా ముంబ్రా బైపాస్‌ వద్ద వారు బ్లాస్ట్‌ ట్రయల్స్‌ను చేపట్టారని ఏటీఎస్‌ అధికారులు తెలిపారు.

పేలడు పదార్ధాలు, విషపూరిత పదార్ధాల తయారీలో శిక్షణ కూడా తీసుకున్నట్టు వెల్లడైంది. ఐఎస్‌తో సంబంధాలు కలిగిన ఉమ్మాతే మహ్మదీయ గ్రూపునకు చెందిన 10 మంది సభ్యులను మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం ఈ ఏడాది జనవరిలో అరెస్ట్‌ చేసి భారీ ఉగ్ర కుట్రలను నిలువరించింది.

మరిన్ని వార్తలు