రాష్‌ డ్రైవింగ్‌పై సుప్రీం కీలక తీర్పు

4 Sep, 2018 17:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాష్‌ డ్రైవింగ్‌తో థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ వర్తించదని వ్యాఖ్య

వ్యక్తిగత ప్రమాదం బీమా మాత్రమే వర్తిస్తుందని తీర్పు

సాక్షి, న్యూఢిల్లీ : వాహన ప్రమాద బీమా విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అజాగ్రత్తగా రాష్‌ డ్రైవింగ్‌ చేసి ప్రమాదానికి గురైన వారికి థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ వర్తించదని స్పష్టం చేసింది. దిలీప్‌ భౌమిక్‌ వర్సెస్‌ నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ కేసును జస్టిస్‌ ఎన్వీ రమణ, ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ మేరకు గతంలో త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. 

కేసు వివరాలు.. తన రాష్‌ డ్రైవింగ్‌ కారణంగా త్రిపురకు చెందిన దిలీప్‌ భౌమిక్‌ 2012, మే 20న జరిగిన కారు ప్రమాదంలో మరణించాడు. దిలీప్‌ మృతికి ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి నష్ట పరిహారాన్ని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు కోర్టులో దావా వేశారు. విచారించిన త్రిపుర హైకోర్టు మృతుని కుటుంబ సభ్యులకు 10.57 లక్షల రూపాయలు చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది. ఈ తీర్పుపై బీమా కంపెనీ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాదనలు వినిపించింది. సొంత తప్పిదం వల్లే కారు ప్రమాదానికి గురై దిలీప్‌ మరణించాడని పేర్కొంది.

మోటార్‌ వెహికల్స్‌ చట్టం ప్రకారం దిలీప్‌ థర్డ్‌ పార్టీ కిందకి రాడని సుప్రీం కోర్టుకు విన్నవించింది. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు అజాగ్రత్తగా డ్రైవింగ్‌ చేసి ప్రాణాలు కోల్పోయిన దిలీప్‌ భౌమిక్‌ మృతికి బీమా కంపెనీ ఎలాంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని తీర్పునిచ్చింది. కానీ, వ్యక్తిగత ప్రమాద బీమా పరిహారంగా మృతుని కుటుంబానికి రెండు లక్షల రూపాయలు (వడ్డీ అదనం) చెల్లించాలని తెలిపింది. అయితే, రాష్ డ్రైవింగ్‌ వల్ల ప్రమాదానికి గురైన ఇతరులకు (థర్డ్‌ పార్టీ) నష్టపరిహారం చెల్లించే విషయంలో ఈ తీర్పు ఎటువంటి ప్రభావం చూపించబోదని సుప్రీం వెల్లడించింది. 

మరిన్ని వార్తలు