ఆరోగ్య సిబ్బంది బీమా నిబంధనలు ఇవే.. 

29 Mar, 2020 19:00 IST|Sakshi

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ సమయంలో దేశంలో పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన పేరుతో రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల, పారా మెడికల్‌ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు రూ. 50 లక్షల ఆరోగ్య బీమా ప్రకటించింది. తాజాగా ఆదివారం ఇందుకు సంబంధించిన నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. 

కరోనా పేషెంట్లకు నేరుగా సేవలు అందిస్తున్న, వారి బాధ్యతలు పర్యవేక్షిస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లతో సహా 22.12 లక్షల మంది పబ్లిక్‌ హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్లకు ఈ బీమా వర్తించనుంది. వారు విధుల నిర్వర్తించే క్రమంలో.. ప్రమాదవశాత్తు కరోనా సోకితే ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంటుందని కేంద్రం తెలిపింది. మొత్తం 90 రోజుల పాటు ఈ బీమా అమల్లో ఉండనుందని.. దీని కింద రూ. 50 లక్షలు అందజేయనున్నట్టు చెప్పింది. అలాగే అసాధారణ పరిస్థితుల్లో కరోనా సంబంధింత సేవలు అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల ఉద్యోగులు, రాష్ట్రాలు నియమించుకున్న అవుట్‌ సోర్స్‌ సిబ్బందితో పాటు పలు విభాగాలకు ఈ బీమా వర్తించనున్నట్టు పేర్కొంది. అయితే వీరి సంఖ్య కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచనలకు లోబడి ఉంటుందని వెల్లడించింది. ఈ బీమా పొందే లబ్ధిదారులు.. ఇతర ఇన్సురెన్స్‌ పాలసీ చేయించుకుని ఉంటే వాటిని కూడా పొందవచ్చని తెలిపింది.

మరిన్ని వార్తలు