రెండు రోజుల్లో మరిన్ని ఆత్మాహుతి దాడులు : ఐబీ

21 Feb, 2019 13:04 IST|Sakshi

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని మరువక ముందే అందుకు బాధ్యత వహించిన... జైషే మహ్మద్‌ సంస్థ మరిన్ని ఆత్మాహుతి దాడులకు సిద్ధమవుతున్నట్లుగా తమకు సమాచారం అందిందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. రానున్న రెండు రోజుల్లో జమ్ముకశ్మీర్‌లో భారత భద్రతా బలగాల వాహనాలపై దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించాయి. చౌకీబాల్‌ నుంచి తంగ్‌ధార్‌ వెళ్లే మార్గాల్లో ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇందుకోసం తాంజీమ్‌ అనే ఇస్లామీ సంస్థ ఐఈడీతో నిండిన ఓ గ్రీన్‌ స్కార్పియోను సిద్ధం చేసిందని వెల్లడించాయి. కశ్మీరీ యువకులతో నిరసనలు చేయిస్తూ.. వారి సహకారంతో వాస్తవాధీన రేఖ దాటాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే 5 నుంచి 6 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లో చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి.(లొంగిపోవడం కంటే కూడా చావడానికి సిద్ధం..)

500 కిలోల బ్లాస్ట్‌కు సిద్ధంగా ఉండండి..
జైషే మహ్మద్‌కు చెందిన ఓ సోషల్‌ మీడియా గ్రూపు మెసేజ్‌లను ఇంటెలిజిన్స్‌ వర్గాలు డీకోడ్‌ చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం.... ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. గత వారం కేవలం 200 కిలోల ఐఈడీ మాత్రమే ఉపయోగించాం. 500 కిలోల భారీ బ్లాస్ట్‌కు సిద్ధంగా ఉండండి. కశ్మీరీలపై సైన్యం ఎటువంటి చర్యలకు పాల్పడ్డా.. భద్రతా బలగాలపై మరిన్ని దాడులు జరుగుతాయి. ఇది కేవలం మనకు.. సైన్యానికి జరుగుతున్న యుద్ధం. రండి యుద్ధానికి సిద్ధంగా ఉండండి’ అని జైషే.. భారత ఆర్మీని హెచ్చరించింది. ఇక భద్రతా వైఫల్యం కారణంగానే పుల్వామా దాడి జరిగిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై సైనికులు ప్రయాణిస్తున్న సమయంలో పౌరుల వాహనాలను అనుమతించడంతో పుల్వామా దాడి సాధ్యమైందని సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరో దాడికి జైషే సిద్ధమవుతోందన్న ఇంటెలిజెన్స్‌ హెచ్చరికలతో కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.(‘లొంగిపోండి.. లేదంటే అంతం చేస్తాం’)

కాగా పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ కమాండర్‌ ఆదిల్‌... సీఆర్‌పీఎఫ్‌ బలగాల వాహన శ్రేణిని ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ క్రమంలో పుల్వామా దాడిలో కీలక సూత్రధారిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అనంతరం.. కశ్మీర్‌లో తిరిగే ప్రతీ ఉగ్రవాదిని అంతం చేస్తామని ఆర్మీ అధికారులు మీడియా ముఖంగా హెచ్చరించారు. ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న కశ్మీరీ యువత లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.(పుల్వామా ఉగ్రదాడి‌; మాస్టర్‌ మైండ్‌ హతం!)

మరిన్ని వార్తలు