ఎస్పీపై అటాక్‌ తోనే అలర్టయ్యాం

4 Jan, 2016 06:58 IST|Sakshi
ఎస్పీపై అటాక్‌ తోనే అలర్టయ్యాం

- కీలక ప్రాంతంలోకి చొరబడకుండా ఉగ్రవాదుల్ని అడ్డుకున్నాం
- పఠాన్ కోట్ ఉగ్రదాడిపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి వివరణ

న్యూఢిల్లీ:
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో పటిష్ఠ నిఘా ఉండటం వల్లే ఉగ్రవాదులు కీలక ప్రాంతంలోకి చొరబడలేకపోయారని కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహర్షి అన్నారు. పఠాన్ కోట్ లో ఉగ్రదాడిపై ఆదివారం ఢిల్లీలో అధికారిక ప్రకటన చేసిన ఆయన.. ఎస్పీపై దాడి జరిగిందని తెలిసిన వెంటనే అప్రమత్తమైనట్లు చెప్పారు.

'శుక్రవారం గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ పై ఉగ్రవాదులు దాడిచేసి, కారును అపహరించారని తెలిసిన వెంటనే ఇంటెలిజెన్స్, ఎయిర్ ఫోర్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ వద్ద నిఘా పెంచాం. అందువల్లే ఉగ్రవాదులు టెక్నికల్ ఏరియాలోకి అడుగుపెట్టలేకపోయారు. ముష్కరులు.. నాన్ ఆపరేషన్ ఏరియా దాటి రాకుండా నివారించగలిగాం. తద్వారా భారీ ముప్పు తప్పినట్లయింది. దాడిలో పాల్గొన్న మొత్తం ఆరుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు అంతమొందించాయి' అని రాజీవ్ మెహర్షి చెప్పారు.

ఇప్పటివరకు భద్రతా బలగాలు ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చగా మరో ఉగ్రవాది ఇంకా సజీవంగా ఉన్నట్లు సమాచారం. ఆ ఒక్కడినీ అంతం చేసేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తంగా ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనే విషయం మృతదేహాలు సేకరించిన తర్వాతే ప్రకటిస్తామని ఎయిర్ మార్షల్ అనిల్ ఖోస్లా అన్నారు. నిఘా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయటం వల్లే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ కు భారీ ముప్పు తప్పిందని,  ఒకవేళ ఇంటెలిజెన్స్ సకాలంలో స్పందించకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

>
మరిన్ని వార్తలు