వావ్‌.. టైట్రాన్‌ రోవ్‌

5 Jan, 2020 02:48 IST|Sakshi

‘రవాణా’కు రోబో.. ప్రస్తుతం పరీక్షల దశలో టెక్నాలజీ

మనుషుల్ని ఒకచోట నుంచి మరోచోటకు చేరవేసేందుకు ఉపయోగం

(బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): నడక ఆరోగ్యానికి మంచిదంటారు కానీ.. నగరాల్లో చాలామంది వేతన జీవులకు నడక నరకప్రాయమే. ఎడతెగని దూరాలు, సమయానికి ఆఫీసుకు చేరుకోవాలనే టెన్షన్, తడిసిమోపెడయ్యే ప్రయాణ ఖర్చులు.. ఉద్యోగాల కోసం రోజూ ప్రయాణాలు చేసే వారి ఇబ్బందులివి. బస్సులు, మెట్రోలు, ఊబర్, ఓలాలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా సొంతంగా ఓ వాహనం ఉండటం మేలన్న భావన వీరిలో బలపడేందుకు లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ.. అంటే ఇంటికి అతి దగ్గరగా చేర్చే రవాణా మార్గమేదీ లేకపోవడం ఒక కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రైమ్‌రైల్‌ ఇన్ఫ్రా ల్యాబ్స్‌ సంస్థ ప్రయత్నిస్తోంది.

మనుషులను చేరవేసే రోబో
టైట్రాన్‌ రోవ్‌.. డ్రైవర్, డీజిల్‌ అవసరం లేని తెలివైన రోబోటిక్‌ వాహనమిది. ఒకచోటి నుంచి ఇంకోచోటికి మనుషులను చేరవేసేందుకు దీనిని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు మెట్రో స్టేషన్‌ నుంచి రైల్వే, బస్‌స్టేషన్లకు, సువిశాలమైన విశ్వవిద్యాలయాలు, షాపింగ్‌మాల్స్, ఐటీ ఎస్‌ఈజెడ్‌లలో వేర్వేరు ప్రాంతాలను అనుసంధానించేందుకు ఉపయోగపడతాయివి. పూర్తిగా విద్యుత్తుతో నడుస్తాయి కాబట్టి కాలుష్యం బెడద ఉండదు. ఇవి.. తాము నడిచే దారిలో పైకప్పుపై ఏర్పాటుచేసే సోలార్‌ ప్యానెల్‌ల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తునే వాడుకుంటాయి. చిన్న సైజులో ఉండటం వల్ల రహదారులపై ఎక్కువ స్థలం ఆక్రమించవు. అవసరాన్నిబట్టి టైట్రాన్‌ రోవ్‌ సైజును నిర్ణయించుకోవచ్చు.

గంటకు మూడు వేల నుంచి 15 వేల మందిని ఒకచోటి నుంచి ఇంకోచోటికి తరలించవచ్చునని కంపెనీ చెబుతోంది. మహా నగరాల్లో మెట్రో ఫీడర్‌ షటిల్స్‌గా, రెండు, మూడో తరగతి పట్టణాల్లో మెట్రోలకు లేదంటే జీబీఆర్‌టీ (బస్సులకు ప్రత్యేకమైన స్థలం కేటాయించడం)కి ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. వీటితోపాటు ఎయిర్‌పోర్ట్, విద్యాసంస్థలు, పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రజలను వేగంగా అటుఇటు తిప్పేందుకు వాడుకోవచ్చు.

బెంగళూరులో పరీక్షలు
టైట్రాన్‌ రోవ్‌ టెక్నాలజీని పరీక్షించేందుకు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 430 మీటర్ల పొడవైన టెస్టింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో రోబోటిక్‌ వాహనాలను పరీక్షిస్తున్నారు. ఇద్దరు మా త్రమే కూర్చోగలిగిన రోవ్‌లతో జరుగుతున్న పరీక్షలు ఫలితాలిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. 2017 అక్టోబరులో తాము ఈ టెక్నాలజీపై పేటెంట్లు సంపాదించామని, ఏడాది తిరిగేలోపు టెస్టింగ్‌ ట్రాక్‌ నిర్మాణం పూర్తి చేశామని, గత సెప్టెంబరు నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నామని కంపెనీ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగపు డైరెక్టర్‌ అరుణ్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఏడాది మార్చిలో పూరిస్థాయి పరీక్షలు, ఐఎస్‌ఏ సర్టిఫికేషన్‌ సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఢిల్లీతోపాటు జైపూర్, కోచి మెట్రో రైల్‌ అధికారులతో టైట్రాన్‌ రోవ్‌ల వాడకంపై ఇప్పటికే చర్చిస్తున్నామన్నారు. అన్నీ సవ్యంగా సాగితే మరో ఏడాదిలోపు ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందన్నారు. పూరిస్థాయిలో టైట్రాన్‌ రోవ్‌ల వాడకానికి కిలోమీటర్‌కు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లు ఖర్చవుతాయని వివరించారు. అవసరాన్ని బట్టి నేలపై, లేదంటే స్తంభాలకు వేలాడుతూ కూడా టైట్రాన్‌లను ఏర్పాటు చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. 

>
మరిన్ని వార్తలు